చేరికలకు చంద్రబాబు గేట్లు ఎత్తేస్తారా?

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా ముంది ముందుకు వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉండగా, మరికొందరు ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం చేరికలపై ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పటికే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి బాగాలేదు. టీడీపీ నేతలకు, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మధ్య అసలు పొసగడం లేదు. అద్దంకి, చీరాల, బద్వేలు, కందుకూరు, మార్కాపురం ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు, పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మధ్య పెద్దయెత్తున వైరమే నడుస్తోంది. అందుకే చంద్రబాబు చేరికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చేరికలపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇన్ ఛార్జులు సక్రమంగా లేని చోటే…..

టీడీపీలో చేరేందుకు కేవలం వైసీపీ నేతలే కాకుండా ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా ఉత్సాహం చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. కొందరు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు మరికొందరు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. అయితే చంద్రబాబు పార్టీలో ఇబ్బడి ముబ్బడిగా నేతలను చేర్చుకుంటే అసలుకే ఎసరు వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు క్రియాశీలకంగా లేని చోట చేర్చుకోవాలని భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలో ఉన్నా యాక్టివ్ గా లేరు. పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాంటి నియోజకవర్గాల్లో చేరికలకు అనుమతించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద మరికాసేపట్లో టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది తెలిసిపోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*