జగన్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యాక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా కన్పిస్తోంది. ఎందుకంటే జగన్ కు ముస్లిం మైనారిటీలతో పాటు క్రిస్టియన్లు కూడా అధికసంఖ్యలో మద్దతును గత ఎన్నికల్లో పలికారు. వాస్తవానికి ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఏపీలో జగన్ కొల్లగొట్ట గలిగారు. అందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సీటు కూడా రాకుండా పోయింది. రాష్ట్ర విభజన చేసిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎలా దగ్గరకు తీసుకుంటారని గత ఎన్నికల్లో ఇటు టీడీపీ, వైసీపీలు బలంగా తీసుకెళ్లడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. అయితే ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలొస్తాయని, ఏపీ త్వరితగతిన అభవృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించమని చెప్పేయడం, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి నడిసంద్రంలో చిన్న కొయ్య దొరికినట్లయింది. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ వి కలలేనా?

అయితే నిన్నమొన్నటి వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను కాంగ్రెస్ పార్టీ సమర్ధించేది. ప్రతి విషయంలోనూ జగన్ ను వెనకేసుకొచ్చేది. కాని జగన్మోహన్ రెడ్డి ప్రధానిమోడీతో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ పై విమర్శలకు దిగుతోంది. జగన్ ప్రత్యేకహోదా నినాదాన్ని మరిచిపోయాడని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. అసలు విషయమేంటంటే జగన్ ఓటు బ్యాంకు తమకు వచ్చే ఎన్నికల్లో వచ్చి పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆశపడుతున్నారు. జగన్, బీజేపీ బంధం బలపడుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. బీజేపీ ఎవరికి మద్దతిచ్చినా ఒకటే. గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే టీడీపీ గెలవలేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జగన్ ఓటుబ్యాంకుకు చిల్లు పడే ప్రమాదమేమీ లేదని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఆ ఓటు బ్యాంకు రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందులోనూ ఏపీలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. కుల, ప్రాంతీయ సమీకరణాలు ఎన్నికల్లో పనిచేస్తాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు వెళుతుందనడం అర్ధం లేని వాదనగా కొందరు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం జగన్ ఓటు బ్యాంకు తమకు గంపగుత్తగా పడిపోతుందని కలలు కంటోంది.

1 Comment on జగన్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందా?

  1. తెలుగు రాష్ట్రాన్ని అడ్డంగా విభజించినందుకు అది ఇష్టం లేని తెరాస కూడా అక్కడ దారుణంగా ఓడించింది. కాంగ్రెస్ ఇంకా పది సంవత్సరాలు వున్నా గెలవలేదు ..ఏ పి ప్రజలు కాంగ్రెస్ ను దాదాపుగా మరిచిపోయారు..

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1