జగన్ కు పోటీగా పవన్ ?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను నీరుగార్చేందుకు టీడీపీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా త్వరగా పవన్ కల్యాణ్ రధయాత్ర ప్రారంభించాలని కోరుకుంటోంది. ఇందుకు టీడీపీలో ఒక ఎమ్మెల్యేను పవన్ వద్దకు వంపినట్లు సమాచారం. జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. మీడియా కూడా జగన్ పాదయాత్రను హైలెట్ చేస్తోంది. జగన్ పాదయాత్రతో టీడీపీకి కొంత ఇబ్బంది ఏర్పడుతుందన్నది అందరికీ తెలిసిందే. తొలి మూడు, నాలుగురోజులు జగన్ విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు తర్వాత మానేశారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి తప్ప పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. అయితే వీలయినంత త్వరగా పవన్ చేత యాత్ర ప్రారంభిస్తే జగన్ వెనకబడిపోతారన్నది టీడీపీ నేతల భావన.

పవన్ చేత త్వరగా యాత్ర చేయించాలని….

అందుకోసమే జనసేనానికి నమ్మకంగా ఉండే విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల జనసేనానిని కలిసినట్లు తెలిసింది. ఎన్నికలు వచ్చే ఏడాది చివరిలోనే ఉండే అవకాశముందని ఆయన పవన్ కల్యాణ్ కు వివరించారు. వీలయినంత త్వరగా ప్రజల్లోకి వెళితే కొంత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పవన్ కు పదే పదే చెప్పారు. అయితే పవన్ మాత్రం తాను జనవరి నెలలోనే యాత్ర ప్రారంభించాలనుకుంటున్నానని, అప్పటి వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తన మనస్సులో మాట చెప్పారు. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం వీలయితే రెండు మూడు ప్రాంతాల్లో సభలు పెట్టడం కూడా మంచిదే అని సలహా ఇచ్చారట. పవన్ యాత్ర ప్రారంభిస్తే జగన్ కు మీడియా కవరేజీ ఉండదని, జగన్ ను ఎవరూ పట్టించుకోరన్నది టీడీపీ వ్యూహంగా కన్పిస్తుంది. కాని పవన్ మాత్రం తక్కువా. తాను అనుకున్నది అనుకున్న సమయానికే చేస్తారు కాని… ఒకరు చెబితే వింటారా? మొత్తం మీద జగన్ పాదయాత్రలో ఉండగానే పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేపట్టడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*