
వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా ఆ పార్టీ నేతలకు ఊరటనిచ్చింది. ప్రశాంత్ కిషోర్ బృందం గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల వివరాలను, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నసంగతి తెలిసిందే. అయితే ప్రాధమికంగా ప్రశాంత్ కిషోర్ తన బృందంతో చర్చించిన తర్వాత జగన్ పై ఏపీలో వ్యతిరేకత ఉన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ కు మకాం మార్చాలని జగన్ కు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లవుతున్నా జగన్ తన పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏపీకి మార్చలేదు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే తన కార్యాలయాన్ని, నివాసాన్ని వదలలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ టీం పర్యటిస్తున్న అనేక ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ సమస్యనే ప్రస్తావిస్తుండటంతో తొలుత ఏపీకి నివాసాన్ని మార్చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు.
మకాం…కార్యాలయాన్ని మార్చాల్సిందే…..
రాష్ట్రం విడిపోయిన వెంటనే ఏపీ సర్కార్ వెంటనే తన పరిపాలనను అమరావతికి మార్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం విజయవాడలోనే నివాసముంటున్నారు. మంత్రులు, అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. కాని ప్రతిపక్ష నేత మాత్రం ఏపీకి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారన్న విమర్శలు గత కొంతకాలం నుంచి విన్పిస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా ఈ విషయాన్ని అనేకసార్లు అధినేత దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఎవరు పార్టీలో చేరాలన్నా…సమావేశానికి రావాలన్నా… పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ కు రావాల్సిందే. అయితే ఇటీవల జగన్ విజయవాడకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమస్య ప్రశాంత్ కిషోర్ టీం కు కూడా ఎదురయింది. క్షేత్రస్థాయిలో ఏపీ ప్రజలు జగన్ పొరుగు రాష్ట్రంలో ఉండటాన్ని తప్పుపడుతున్నట్లు వారు చేస్తున్న సర్వేలో వెల్లడి కావడంతో అదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారని తెలిసింది. వీలయినంత త్వరగా నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని మార్చేయాలని సూచించడంతో జగన్ కూడా దానికి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో వైసీపీ నేతలు ఊరట చెందారు. ఇంతకాలం తాము చెప్పినా పట్టించుకోని జగన్ …ఎన్నికల వ్యూహకర్త చెప్పిన వెంటనే అంగీకరించినందుకు సంబర పడిపోతున్నారు.
Leave a Reply