జగన్ ఝలక్ తో క్యాంపు పాయె… కాసులు..పాయె…!

సంక్రాంతి పండగ ముందే వచ్చిందనుకున్నారు. మళ్ళీ లక్షలకు లక్షలకు సంపాదించుకోవచ్చనుకున్నారు. కాని వారి ఆశలు అడియాసలే అయ్యాయి. కర్నూలు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల తీరిది. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పండగే పండగ. వారి ఓటుకు అంత విలువ ఉంటుంది. ఇక ఎన్నికల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకూ వారిని మహారాజుల్లా చూసుకుంటారు. వారికి గౌరవ మర్యాదలు పుష్కలంగా లభిస్తాయి. కర్నూలు జిల్లాల్లో గతంలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల తీరును పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది.

గత ఎన్నికల్లో….

నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ తేదీ వరకూ వారిని క్యాంప్ లకు తరలిస్తారు. బెంగళూరు, గోవా వారు కోరుకున్న చోటకు విమానాల్లో తీసుకెళ్తారు. ఖరీదైన రిసార్ట్స్ లో బస ఏర్పాటు చేస్తారు. కొంత ఫిక్స్ డ్ ఎమైంట్ కూడా ముట్టజెబుతున్నారు. గత ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థికి పది కోట్ల రూపాయలకు పైగానే ఖర్చయ్యిందన్నది అంచనా. రెండు పార్టీలూ క్యాంపులను నిర్వహించి పోలింగ్ రోజుకు కర్నూలుకు తీసుకు వచ్చారు. రాజభోగాలు అనుభవించి వచ్చారు. కొందరైతే కుటుంబ సభ్యులతో సహా టూర్లకు కలిసి వెళ్లారు.

మరోసారి నమిలేద్దామంటే…

అయితే ఎన్నిక పూర్తయి నెలలు తిరక్కుండానే మళ్లీ నోటిఫికేషన్ రావడంతో పండగ చేసుకుందామనుకున్నారు. అయితే వీరి ఆనందానికి జగన్ షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జగన్ నిర్ణయించడంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ స్థానికసంస్థల ప్రతినిధులు నిరాశలో మిగిలిపోయారు. ఎన్నిక వస్తే తృణమో…ఫణమో గిట్టుబాటు చేసుకుందామనుకున్న కొందరు స్థానిక నేతలకు ఆ అవకాశం లేకుండా పోయింది. కర్నూలు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరం కావడంతో ఇక ఎన్నికలో టెన్షన్ ఉండదు. ఏకగ్రీవమే అవుతుంది. ఇక అప్పడు క్యాంప్ లుండవ్…కానుకలుండవ్… దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్నూలు జిల్లా స్థానికసంస్థల ప్రతినిధులు పార్టీలకతీతంగా తెగ ఫీలయిపోతున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*