జగన్ దూకుడు విజయంతెచ్చి పెడుతుందా?

tammineni sitharam-ysjaganmohanreddy

జగన్ ఇక దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత దిగజార్చకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే కాకుండా తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు. 2018 చివరకు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీని పటిష్టపర్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను కూడా ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ వీక్ ఉన్నదీ…. పార్టీ వీక్ ఉన్నచోట ప్రస్తుతం ఉన్న నేతలకు కాకుండా ఇతరులకు ఇస్తు బలోపేతం అవుతుందా? లేదా? అన్న దానిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందన్న విషయం వైసీపీ అధినేత దృష్టికి వచ్చింది.

పాదయాత్ర కంటే ముందుగానే…..

దీంతో జిల్లాల వారీగా నివేదికలు జగన్ తెప్పించుకుంటున్నారు. తాను పాదయాత్ర చేపట్టేలోపు ముందే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే వారిని ప్రజలకు పరిచయం చేయాలని జగన్ భావిస్తున్నారు. అప్పటి నుంచే ప్రజల్లో ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజా సమస్యలపైన స్పందిస్తే మంచి ఫలితాలు రావచ్చన్నది జగన్ అంచనా. అందుకోసమే బలహీనంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను జగన్ మార్చేయనున్నారని వైసీపీలో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి జగన్ ఈ జాబితాలపైనే కసరత్తులు చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ముందు జాగ్రత్త సత్ఫలితాలనిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*