జగన్ దూతతో మోడీ భేటీ వెనుక?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెల‌య‌దు! ఊహించింది జ‌రిగితే.. అస్స‌లు రాజ‌కీయాలే కావంటారు సీనియ‌ర్లు!! అలాంటి ప‌రిణామ‌మే ఇప్పుడు చోటు చేసుకుంది. అయ్యా ఒక్క నిముషం మాకు అప్పాయింట్ మెంట్ ఇవ్వండి. మా స‌మ‌స్య‌లు వినండి. అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న ప‌రివార ఎమ్మెల్యేలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేషీ చుట్టూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని కొన్ని మాసాలుగా తిరుగుతున్నారు. సాక్షాత్తూ.. కేంద్ర‌ మంత్రి సుజ‌నా చౌద‌రితో సైతం బాబు సిఫార‌సు చేయించుకున్నా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో బాబు ఈ బాధ‌ను మౌనంగానే భ‌రిస్తున్నారు. అయితే, ఇంత‌లో బాబుకు గోరుచుట్టుపై రోక‌లి పోటు లాగా.. తాను అడిగితే ప‌ట్టించుకోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువు అయిన వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి దాదాపు 30 నిముషాల స‌మ‌యం కేటాయించారు.

విజయసాయితో ఏం చర్చించారు?

ఈ ప‌రిణామాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలావుంటే, విజ‌య‌సాయితో భేటీ అయిన ప్ర‌ధాని మోడీ.. ఏం చ‌ర్చించి ఉంటార‌నే ప్ర‌శ్న స‌ర్వ‌సాధార‌ణంగానే వెలుగు చూస్తుంది. ఈ క్ర‌మంలోనే అనేక మంది అనేక ర‌కాలుగా దీనికి స‌మాధానం చెబుతున్నారు. ప్ర‌ధానంగా ఏపీలో బీజేపీ త‌న మిత్ర ప‌క్షం టీడీపీపై చేస్తున్న విమ‌ర్శ‌లు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో కేంద్ర నిధుల‌తో చేప‌డుతున్న ప‌నుల‌కు కూడా బాబు త‌న పేరు పెట్టుకోవ‌డం, త‌న ట్యాగు వేసుకోవ‌డం వంటివి కూడా సాయి రెడ్డి వివ‌రించార‌ని తెలుస్తోంది. అదేవిధంగా ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర విష‌యం కూడా వీరిమ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు.

పాదయాత్రకు సంబంధించిన….

దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను కొన్నింటిని సాయి రెడ్డి చూపించార‌ని అంటున్నారు. పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌నాలను చూసి మోడీ కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని వైసీపీ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. అదేసమయంలో విజయసాయి.., ప్రధాని ముందు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల విషయం కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టీడీపీ మొన్నటి నంద్యాల ఎన్నికల్లో ఏకంగా డబ్బు వెదజల్లిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే వ్యూహంతో ఉన్నారని.. వారిలా తాము డబ్బు ఖర్చు చేయలేమని, అలా డబ్బులు పంచే ఉద్దేశం కూడా లేదని, అందుకే పోటీ నుంచి విరమించుకున్నామని మోడీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.

వైసీపీలో జోష్….

ఇక‌, ఈ సంద‌ర్భంగానే ఏపీలో బీజేపీకి అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మిస్తే బాగుంటుంద‌నే విష‌యాన్ని కూడా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ పోటీలో సోము వీర్రాజు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కావూరి సాంబ‌శివ‌రావు, మంత్రి మాణిక్యాల‌రావు, పురందేశ్వ‌రి వంటివారు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో వీరిపై చ‌ర్చించార‌ని అంటున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు బీజేపీ ఎలాగూ హ్యాండివ్వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో బాబును కాద‌ని విజ‌య‌సాయికి అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం వైసీపీలో జోష్ నింప‌గా టీడీపీ నేత‌లు మాత్రం కుమిలిపోతున్నారు. మ‌రి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*