జగన్ నిర్ణయాలు బాబుకు కలసి వస్తున్నాయా….?

ఏంటి? న‌మ్మ‌డం లేదా? రాజ‌కీయాల్లో త‌ల‌లు పండిన మేధావులు సైతం ఇదే మాట‌ను అంగీక‌రిస్తున్నారు. వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, వేస్తున్న అడుగులు కూడా ఆయ‌న పార్టీని బ‌లాన్ని చేకూర్చాల‌ని వైసీపీ అధినేత‌గా ఆయ‌న కోరుకోవ‌చ్చు. వైసీపీ నేత‌లుగా ఆపార్టీ జ‌నాలు.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు మ‌ద్ద‌తు కూడా ఇవ్వొచ్చు. అయితే, జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు మాత్రం అధికార పార్టీకి కొండంత అండ‌గా మారుతున్నాయి.

నంద్యాలలో ఓటమి….

జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగు అధికార పార్టీకి మేలిమ‌లుపుగా మారుతోంది. దీంతో టీడీపీ అభివృద్ధికి ఆ పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014లో అధికారం ద‌క్క‌క పోవ‌డంతో జ‌గ‌న్ ఏ స్థితిలో ఉంటున్నారో తెలియ‌దు కానీ, ఆయ‌న తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌య‌మూ ఆయ‌న‌కు యాంటీ అయిపోతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పోటీ వ‌ద్ద‌ని, అక్క‌డ భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో సెంటిమెంటు నింగినంటింద‌ని, ఈ స‌మ‌యంలో మ‌నం అక్క‌డ గెల‌వ‌లేమ‌ని నెత్తీ నోరూ మొత్తుకున్నా జ‌గ‌న్ వినిపించుకోలేదు. అక్క‌డ పోటీ పెట్టాడు. దీంతో ఘోర‌మైన ఓట‌మిని ఎదుర్కొన్నాడు.

ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో…

ఇదే స‌మ‌యంలో టీడీపీకి ఈ నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌గా మారింది. ఇక‌, అదే జిల్లాలో జ‌రిగిన ఎమ్మెల్సీ బైపోల్‌కు పోటీ పెట్టాల‌ని, పెడితే త‌ప్ప‌కుండా గెలుస్తామ‌ని వైసీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఓ మంచి ఉద్దేశంతో చేసిన రాజీనామాను సెంటిమెంట్‌గా వాడుకుంటే మంచిద‌ని చెప్పినా జ‌గ‌న్ ప‌ట్టించుకోకుండా పోటీ వ‌ద్ద‌న్నాడు. దీంతో అక్క‌డ వ్య‌తిరేక గాలి వీస్తున్నా.. టీడీపీ విజ‌యం సాధించింది. ఇక‌, అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల విష‌యంలోనూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం అధికార పార్టీలో బూస్ట్ నింపింది. త‌న పార్టీ నేత‌ల ఫిరాయింపుల‌ను ప్ర‌శ్నిస్తూ.. స‌భ‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. దీనిపై ముందుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొంత ఆందోళ‌న‌కు గురైన మాట వాస్త‌వం. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుందేమోన‌ని భావించింది కూడా. అయితే, రోజులు గ‌డిచేకొద్దీ.. జ‌గ‌న్ ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌భ‌ల‌ను ముందు అనుకున్న దానిక‌న్నా కొన్ని రోజులు ఎక్కువే నిర్వ‌హించి.. కీల‌క బిల్లులు ఆమోదించింది. ఈ ప‌రిణామం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాట‌య్యాక చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చిన గొప్ప అవ‌కాశంగా విశ్లేష‌కులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

గుంటూరు, కృష్ణాల్లో కనిపించని…

ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఏదొ ఒక ర‌కంగా ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి చేకూరుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఎందుకు చేస్తున్న‌ట్టు అని ప్ర‌శ్నించే వారు క‌నిపిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న 1000 కిలో మీట‌ర్ల మేర‌కు పాద‌యాత్ర పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో వాక్ విత్ జ‌గ‌న‌న్న అనే వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీనివ‌ల్ల వైసీపీ బ‌లం ఏంటో అధికార టీడీపీకి తెలుస్తుంద‌ని, బుద్ధి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావించారు. అయితే, అనుకున్న‌ది ఒక్క‌టి జ‌రిగింది ఒక్క‌టి అన్న‌చందంగా మారింది ప‌రిస్థితి. మొత్తం 13 జిల్లాల్లో అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని ప్రాంత జిల్లాలైన గుంటూరు , కృష్ణాల్లో ఎక్క‌డా దీని ప్రభావం క‌నిపించ‌లేదు. క్షేత్ర‌స్థాయిలో నేత‌లు ఎవ‌రూ రోడ్డు ఎక్క‌లేదు. అనంత‌పురంలో కొంద‌రు నేత‌లు ఇలా క‌నిపించి అలా వెళ్లిపోయారు. చిత్తూరులోనూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ప్ర‌భావం క‌నిపించినా.. కొద్దిసేప‌టికే ప‌రిమితం అయింది. విజ‌య‌వాడ‌లో కీల‌కంగా ఇటీవ‌ల వెలుగు లోకి వ‌చ్చిన వంగ‌వీటి రాధా పార్టీమారుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాను వైసీపీలోనే ఉంటాన‌ని ఆయ‌న చెప్పాడు. అయితే, వాక్ విత్ జ‌గ‌న‌న్న‌లో ఆయ‌న పార్టీసిపేష‌న్ క‌నిపించ‌లేదు. దీనిని బ‌ట్టి వైసీపీ బ‌లం రాష్ట్రంలో చాలా త‌క్కువ ఉంద‌ని, జ‌గ‌న్ పిలుపును ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తేట‌తెల్లం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*