జగన్ పార్టీలో సీటు కోసం కొట్లాట

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నోరుజారడంతో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ ప్లీనరీలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డిలు గత కొంతకాలంగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో విన్పిస్తున్నాయి. ఆయన పార్టీ కార్యక్రమాలకు, క్యాడర్ కు ఇటీవల కాలంలో దూరంగా ఉంటూ వస్తున్నారు. రామిరెడ్డిపై అక్రమ మద్యం కేసులు ఉండటంతో ఆయన అధికారపార్టీలో చేరి కేసులను కొట్టివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు గతంలోనే వచ్చాయి. ఈ నేపథ్యంలో రామిరెడ్డి ప్రతాప్ పార్టీ మారతారని భావించిన వంటేరు, కాటంరెడ్డిలు కావలి నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. క్యాడర్ కు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంపీపై జగన్ కు ఫిర్యాదు….

అయితే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాత్రం పార్టీని ఇంతవరకూ వీడలేదు. వైసీపీ క్యాడర్ కూడా ఆయనను దూరంగా పెట్టింది. దీంతో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని రామిరెడ్డి ఆశ్రయించారు. వైసీపీ నియోజకవర్గ ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ వస్తుందని చెప్పాలని ఎంపీని కోరారు. అప్పుడే క్యాడర్ తన మాట వింటుందని ఎంపీ మేకపాటిని బతిమాలుకున్నారు. దీంతో వైసీపీ కావలి నియోజకవర్గ ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లో కావలిలో సిట్టింగ్ కే మళ్లీ సీటు ఇస్తామని ఎంపీ మేకపాటి బహిరంగంగానే చెప్పేశారు. దీనిపై అక్కడే ఉన్న ఒంటేరు, కాటంరెడ్డి వర్గాలు భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికనేది ఒక పార్లమెంటు సభ్యుడు ఎలా నిర్ణయిస్తారని వారు బహిరంగంగానే తప్పుపట్టారు. ఎంపీ తన పని తాను చూసుకోవాలని, సీట్ల విషయాలు అవసరం లేదని హెచ్చరికలు కూడా చేశారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేశారు కాటంరెడ్డి, ఒంటేరు. అయితే తాను పిలిపించి మాట్లాడతానని జగన్ ఫోన్లోనే సర్ది చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద కావలి రాజకీయాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1