జగన్ పై ఆ సీనియర్ నేత ఫ్యామిలీ అలిగిందా…?

వైఎస్ అంటే జక్కంపూడి … జక్కంపూడి అంటే వైఎస్ గా తూర్పు గోదావరి జిల్లాలో పేరుంది. వైసిపి అధినేత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వెంటనే జిల్లాలో ఆయన జెండాను తొలిగా భుజానకెత్తుకున్న జక్కంపూడి రామ్మోహన రావు కుటుంబం ఇప్పుడు తమ అధినేతపైనే అలిగింది. జగన్ రాజమండ్రి వచ్చిన సందర్భంలో ఆయన పాదయాత్రలో పక్కన లేకుండా జక్కంపూడి కుటుంబాన్ని దూరం చేశారనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. అలాగే రాజమండ్రి సభలో జక్కంపూడి రామ్మోహన రావు ప్రస్తావన లేకుండా జగన్ తన ప్రసంగం చేయడం చర్చనీయాంశం అయ్యింది. జక్కంపూడి కి ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలిచే టిడిపి కి చెందిన వడ్డివీరభద్రరావు ను పోలవరం ప్రాజెక్ట్ కోసం అహరహం కృషి చేశారని కీర్తించడం జక్కంపూడి కుటుంబం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ వాస్తవానికి వైసిపి సెంట్రల్ కమిటీ సభ్యురాలైన జక్కంపూడి విజయలక్ష్మి జగన్ సభలో మాట్లాడారు. అలాగే వైఎస్సాఆర్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడి హోదాలో వున్న జక్కంపూడి రాజా రోడ్ కం రైలు వంతెన అంతా వైఎస్సాఆర్ , జగన్, జక్కంపూడి కటౌట్ లు బ్యానర్లు జెండాలతో నింపేశారు. ఇక ఫ్లెక్సీల సంగతి సరేసరి. తమ అధినేత కోసం అంత శ్రమ పడితే ఆయన కానీ చెంత వున్న పార్టీ నేతలు కానీ పట్టించుకోకపోవడాన్ని రాజా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. దాంతో ఆయన రెండో రోజు పాదయాత్రలో కానీ మూడవ రోజు యాత్రకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

జగన్ దగ్గర పంచాయితీ …

ఈ అవమానం ఆవేదనపై జగన్ తో జక్కంపూడి రాజా భేటీ అయ్యారని అంటున్నారు. ఒక స్థలాన్ని అమ్ముకుని మరి అధినేత రాకకు ఖర్చు చేస్తే ఇంత చిన్నచూపా అని ఆయన ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే రాజా వాదన విన్న జగన్ సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆయన అలిగినట్లు తెలియవస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ టూర్ కి జక్కంపూడి వర్గం డుమ్మా కొట్టిందని వైసిపి వర్గాలు అంటున్నాయి.

రాజానగరం నియోజకవర్గంలో లేని టూర్ …

వైసిపి అధినేత జగన్ టూర్ రాజానగరం నియోజకవర్గంలో లేకుండా కొందరు రూట్ మ్యాప్ రూపొందించారని, అప్పటినుంచి జక్కంపూడి కుటుంబం కొంత వేదనతో ఉందంటున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గం మీదుగా తమ అధినేత వచ్చేలా చేసి ఉంటే బావుండేదని కావాలనే కొందరు నేతలు తమను తొక్కే ప్రయత్నం చేస్తున్నారనే భావన జక్కంపూడి కుటుంబం లో వుంది.

టి కప్పులో తుఫాన్ అంటున్న వైసిపి …

వైఎస్ కుటుంబంతో అవినాభావ సంబంధాలు కలిగివున్న జక్కంపూడి రామ్మోహన రావు కుటుంబం ఈ సంఘటనలతో మనస్థాపానికి గురైనా పార్టీ మారెలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోబోరని వైసిపి వర్గాలు అంటున్నాయి. తమాంతా ఒకే కుటుంబమని చిన్న చిన్న అలకలు పార్టీలో సహజమేనని ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లా చల్లారి పోతాయని చెబుతున్నారు. జగన్ టూర్ ముగిసే లోగా అన్ని సర్దుకుంటాయని అంటున్నారు. మొత్తానికి జక్కంపూడి కుటుంబానికి వైఎస్ ఆర్ కుటుంబానికి ఫైర్ పెట్టిన కొందరు మాత్రం తాజా పరిణామాలను బాగా ఆస్వాదిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*