జగన్ ప్రకటన తర్వాత బాబు వ్యూహం మారిందా?

వైసీపీ అధినేత జగన్ ప్రకటనతో చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమిస్తామని, ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు. అయితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగానే వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పోరాటం ఉండాలన్నారు. గతంలో మాదిరిగా వేషాలు వేసి నవ్వుల పాలు కాకుండా సీరియస్ గా ఉద్యమ పంథాను అనుసరించాలని చంద్రబాబు ఉద్బోధ చేశారు.

సీరియస్ గా పోరాడాలి……

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ విచిత్ర వేషాలు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చంద్రబాబు కొంత సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వేషాలు కాకుండా చిత్తశుద్ధితో చివర వరకూ పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఏ రకమైన పోరాటం చేయాలన్నదీ నేతలకు నిర్దేశించారు. సభను అడ్డుకోవడమే కాకుండా ప్రతి రోజూ సంబంధిత కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఫాలో అప్ చేయడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

జగన్…కేజ్రీవాల్ లా కాదు…..

అలాగే వైసీపీ అధినేత జగన్ కేంద్రానికి పూర్తిగా లొంగిపోయాడని సమావేశంలో అభిప్రాయపడ్డారు. జగన్ తన కేసుల నుంచి తప్పించుకోవడానికే జీఎస్టీ వచ్చినప్పుడే అభ్యంతరం తెలపకుండా మద్దతిచ్చారన్నారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా మెలిక పెట్టకుండా ఎందుకు బేషరతుగా జగన్ మద్దతిచ్చారన్నారు. జగన్ కు స్వప్రయోజనలే ముఖ్యమన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏం ఒరగదని, పార్లమెంటులో ఉండి పోరాడటమే మంచిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే జగన్ లాగా పూర్తిగా లొంగిపోకుండా, కేజ్రీవాల్ లాగా దూకుడు ప్రదర్శించకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చంద్రబాబు జగన్ ప్రకటన తర్వాత తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.