జగన్ బాటలో పవన్

ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రల కాలం వచ్చినట్లుంది. పాదయాత్రలు చేస్తే సీఎం అయిపోతామని పొలిటీషియర్లు భావిస్తున్నట్లున్నారు. మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నిన్న చంద్రబాబు పాదయాత్ర చేసినందునే ముఖ్యమంత్రులయ్యారని రాజకీయపార్టీల అధినేతలు బలంగానమ్ముతున్నట్లున్నారు. అందుకే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన తేదీని కూడా ప్రకటించారు. అక్టోబరు 27వ తేదీ నుంచి ఆరు నెలలపాటు వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర ఉండనుంది. అయితే మరో పార్టీ అధినేత కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన పాదయాత్ర ఏపీ మొత్తం చేయనున్నట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమచారాన్ని బట్టి తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి…….

అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను అనంతపురంలో పాదయాత్ర చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. ప్రజాసమస్యలను స్వయంగా పరిశీలించేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుందని పవన్ భావించే ఈ ప్రకటన చేశారు. అనంతపురం జిల్లాలో కరువు రక్కసిని కళ్లారా చూడాలనుకున్న కాటమరాయుడు ఇప్పుడు ఏపీ అంతటా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ పాదయాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమవుతుందని పవన్ అభిమానులు చెబుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి బస్సు యాత్రకే అపూర్వ స్పందన వచ్చిన విషయాన్ని పవన్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ లన్నీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. అప్పటికి జనసేన కార్యకర్తల ఎంపిక కూడా పూర్తవుతుండటంతో పవన్ కూడా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో పాదయాత్రల కాలం నడుస్తుందనే చెప్పొచ్చు.