జగన్ లో ఊహించని మార్పు వచ్చిందే

వైసీపీ అధినేత జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక జగన్ లో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఓటమితో కొంత కుంగిపోయిన జగన్ తర్వాత తేరుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని చాలా ధీమాతో ఉన్న జగన్ కు నంద్యాల ప్రజలు షాకిచ్చారు. అలాగే కాకినాడపై కూడా జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నంద్యాలలో ఓడిపోయినా….కాకినాడలో కాప్చర్ చేస్తే సరిపోతుందనుకున్నారు. కాని కాకినాడలో సయితం ఓటర్లు జగన్ కు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దీంతో జగన్ చాలా డీలా పడిపోయారు. కనీసం తన వాయిస్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని ఆయన మదనపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనే ఎక్కడో లోపం ఉందని గుర్తించిన జగన్ అందుకు తగిన చర్యలు తీసుకునందుకు సిద్ధమయ్యారు.

నేతలు, కార్యకర్తలే పార్టీకి……

పార్టీలో కేవలం చేతివేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నేతలే జనం ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని జగన్ గుర్తించారు. అందుకోసం ఇకపై పార్టీ నేతలకు రోజులో కొంత సమయాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఏ పార్టీ నేత వచ్చినా వారి సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలను వినేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇకపై నియోజకవర్గ స్థాయి నేతలు నేరుగా జగన్ ను కలిసే అవకాశముంటుంది. అలాగే ఇన్నాళ్లూ అంతా తానే అని చెబుతున్న జగన్ తన వాయిస్ ను మార్చేశారు. కార్యకర్తలు, నేతల అండలేనిదే తాను ఒక్కడినే చంద్రబాబును ఎదుర్కొనలేనని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం పేరిట జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఇకపై కార్యకర్తలు, నేతలే పార్టీని ముందుకు నడపాలని పిలుపు నివ్వడ పార్టీ శ్రేణులనే ఆశ్చర్య పరిచింది. మొత్తం మీద రెండు ఎన్నికల్లో ఓటమితో జగన్ లో చాలా ఛేంజ్ కన్పిస్తుందని సొంత పార్టీ నేతలే చెబుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*