జగ్గారెడ్డితో ఫైట్ ఈసారి మామూలు కాదు…!

సంగారెడ్డిలో ఈసారి నువ్వా? నేనా…? అన్నట్లే ఉంది. చలి వణికిస్తున్నా… ఇక్కడ మాత్రం ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధాన పక్షాలైన కాంగ్రెైస్, టీఆర్ఎస్ లు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఎన్నికలు అప్పుడే వచ్చాయా? అన్నట్లుంది ఇక్కడి వాతావరణం. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఇప్పటి నుంచే సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

ప్రజలతో ముఖాముఖి….

సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున జగ్గారెడ్డి పోటీ చేస్తారన్నది దాదాపు ఖాయమే. ఇటీవల రాహుల్ సభ కూడా సక్సెస్ కావడంతో జగ్గారెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జగ్గారెడ్డి పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ లను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ జగ్గారెడ్డి పర్యటిస్తున్నారు. ప్రజలలో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కొన్ని సర్వేలు జగ్గారెడ్డికే అనుకూలంగా రావడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సమావేశం ఏర్పాుటు చేసి కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తున్నారు.

టీఆర్ఎస్ కూడా తగ్గడం లేదుగా…

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. చేసిన అభివృద్ధే తనను గెలిపించి తీరుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి స్పీడ్ పెంచడంతో చింతా ప్రభాకర్ కూడా మంత్రులను నియోజకవర్గాలకు రప్పించి సభలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలతో హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీశ్ రావు ఇప్పటికే నాలుగుసార్లు సంగారెడ్డిలో పర్యటించి వెళ్లారు. ఇక ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆదేశాలతో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంగారెడ్డి, సదాశివపేటల్లోని కొన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులను వెచ్చించి మరీ ప్రారంభోత్సవాలను చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలను కూడా పార్టీలో చేర్చుకోవడంలో ప్రభాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. దీంతో జగ్గారెడ్డి తో ఫైట్ ఈసారి మామూలుగా ఉండబోదంటున్నారు టీఆర్ఎస్ నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*