జగ్గారెడ్డి వీళ్లకు టార్గెట్ అయ్యారా?

కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డిని అధికార పార్టీ టార్గెట్ చేసిందా? సంగారెడ్డిలో జయప్రకాశ్ రెడ్డి రాహుల్ సభను విజయవంతంగా నిర్వహించారు. సంగారెడ్డి సభ సక్సెస్ కావడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో సంగారెడ్డిలో అనేక ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేశారు. సంగారెడ్డిలో గట్టిపట్టున్న జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటి నుంచే కార్యకర్తలను సిద్ధంచేసుకుంటున్నారు. అందుకోసం రోజు విడిచి రోజు సంగారెడ్డి సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి సభ సక్సెస్ చేయడంతో జగ్గారెడ్డికి పార్టీ హైకమాండ్ వద్ద కూడా పట్టు పెరిగింది. ఇటీవల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి సభ వీడియో సీడీని కూడా ఆయనకు అందజేశారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డికే జగ్గారెడ్డికి పరిమితం కావద్దని రాష్ట్ర సమస్యలపై పోరాడాలని కూడా రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి…..

అయితే సంగారెడ్డి సభ సక్సెస్ కావడం, ఆతర్వాత వీహెచ్ ఇచ్చిన బ్రాస్ లెట్ ను వేలం వేసి అది ఖమ్మం జిల్లాలో జైలు పాలయిన రైతుకుటుంబాలకు ఇవ్వడం వంటి ఘటనలు అధికారపార్టీకి కోపం తెప్పించినట్లున్నాయి. ఇటీవల వరుసగా ఆయన అనుచరులపై దాడులు జరుగుతున్నాయి. జగ్గారెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అధికార పార్టీ దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జగ్గారెడ్డికి అత్యంత సన్నిహితుడికి చెందిన పెట్రోలు బంకును కూడా ఇటీవల అధికారులు సీజ్ చేశారు. అలాగే జగ్గారెడ్డికి మద్దతుగా ఉన్న సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేశారు. ఇక జగ్గారెడ్డిపై ఉన్న పాత కేసులను తిరగతోడేందుకు సిద్ధమయ్యారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. సంగారెడ్డి సభ సక్సెస్ అయి ఉబ్బితబ్బిబ్బవుతున్న జగ్గారెడ్డి ఈ కేసుల ఊబిలో చిక్కుకోక తప్పదంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీ జగ్గారెడ్డిని టార్గెట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై తాము ఆందోళనలకు కూడా దిగుతామని హెచ్చరించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1