జనంలో జగన్ కే మార్కులా?

ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవిని అంటూ ఒకే స్టాండ్ పై వున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ కి ప్రజలు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. పీకే టీం రహస్య సర్వేల్లో ఈ విషయం తేటతెల్లం కావడంతో వైసిపి వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మొదటి నుంచి ఒకే మాటపై నిలబడటం పోరాడటం అన్ని పార్టీలు ఇదే వాదనకు ఇప్పుడు సై అనడం జగన్ పార్టీకి కలిసొచ్చింది. హోదా కోసం వైసిపి, వామపక్షాలు మొదటి నుంచి ఒకే బాటన నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే వాదన చేస్తున్నా ఆ పార్టీకి ఏపీలో బలం లేకపోవడం అసలు రాష్ట్రానికి పట్టిన ఇంతటి విపత్తుకు హస్తం పార్టీ అన్యాయమే అన్నవాదన ఇంకా కొనసాగుతుంది. అదీ కాక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల కోపం కానీ, ద్వేషం కానీ ఇంకా చల్లారలేదు. దాంతో వారి వాదనకు కానీ పోరాటానికి మద్దతు లభించడం లేదు. ఆ పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు ఉద్యమాన్ని మాత్రం జనం నిశీతంగా గమనిస్తున్నట్లు సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలో వైసిపి ఈ అంశంలో అన్ని పార్టీలకన్నా ముందే ఉందంటున్నాయి సర్వే నివేదికలో జనం.

జనసేన ఆలస్యమైంది …

తెలుగుదేశం పార్టీతో తన మిత్ర బంధాన్ని తెగతెంపులు చేసుకుని పవన్ కళ్యాణ్ జనసేన హోదాపై పోరాటం మొదలు పెట్టింది. అంతకుముందు ప్రత్యేక ప్యాకేజీ పై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించిన పవన్ అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో వెనుక బడ్డారు. రెండు సభలు నిర్వహించి ఆ తరువాత తన షూటింగ్స్ లో బిజీ కావడంతో రావాలిసిన మైలేజ్ పవన్ పార్టీ అందుకోలేక పోయినట్లు ప్రజలు సర్వేలో అభిప్రాయపడినట్లు సమాచారం. కాకపోతే జనసేన కు వైసిపి తరువాత ప్లేస్ ను మాత్రం ప్రజలు కట్టబెట్టినట్లు తెలియవచ్చింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా ఇటు బిజెపి అటు టిడిపి బాగోతాలను ప్రజలకు తెలియచేసే ప్రయత్నాన్ని అంతా హర్షించారు. ఐతే ఆ కమిటీ ద్వారా పవన్ ఏమి తేల్చినా తేల్చకపోయినా అదే సీరియస్ నెస్ తరువాత అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డారన్నది సర్వే టాక్.

మూడో స్థానంలో టిడిపి ….

హోదాపై ఎలుగెత్తి పోరాటం చేయడం లో టిడిపి వెనుకబడిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారంటున్నారు. పార్లమెంట్లో టిడిపి పోరాటం అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును బాబు అన్ని తానై ఎండగడుతున్నా ప్రజల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కడం విశేషం. ఈ సర్వే లోని పాయింట్స్ లీక్ కావడంతో టిడిపి అధినేత రెండు మూడు రోజులనుంచి స్పీడ్ పెంచారు. నేరుగా ప్రధాని, అమిత్ షా లను టార్గెట్ చేస్తూ ఎపి ప్రజలు తమను అర్ధం చేసుకోవాలనే సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటినుంచి ఇదే పోరాట వైఖరి పట్టు సడలకుండా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని టిడిపి భావిస్తున్నట్లు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*