జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారే…!

ఏ సందర్బం,వేడుక, ఉత్సవం వచ్చినా దానిని తెలుగుదేశం ప్రభుత్వం ఈవెంట్ గా మార్చేస్తోంది. తాము ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతే ఏదో మిస్ అయిపోతున్నామనే బలమైన భావన ప్రజల్లో ఏర్పడేలా ప్రచారం నిర్వహిస్తోంది. దాంతో మాస్ హిస్టీరియాలా మారిపోతోంది ప్రజల మనస్తత్వం. దీనిని మరింత వేడుకగా కొనసాగిస్తూ ప్రభుత్వం వింత చూస్తోంది. 2015లో గోదావరి పుష్కరాల ఘట్టంలో రాజమండ్రిలో జరిగిందదే. తాజాగా కృష్ణా పవిత్ర సంగమం వద్ద విజయవాడలో చోటు చేసుకున్న ఘట్టమూ అదే. పదుల సంఖ్యలో మరణించిన విషాదం. దీనికి బాధ్యులెవరు? ప్రజలను ఈ దిశలో నడిపించిన ప్రభుత్వ పెద్దలా? పటిష్ట పర్యవేక్షణతో భద్రత కల్పించలేకపోయినా అధికార యంత్రాంగమా? ఏదేమైనా నష్టపరిహారంతో చేతులు దులుపుకుంటూ దానిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ తమ తప్పేం లేదు అంటూ జరిగిన ఘట్టాన్ని చనిపోయిన వారి ఖర్మకు వదిలేస్తున్నారు. మళ్లీ యథాపూర్వ పరిస్థితి. మరో కొత్త ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది.ఈ విషయంలో విమర్శకుల వేళ్లు ప్రభుత్వాన్నే చూపిస్తున్నాయి.

ఇంకా అనాగరికమే..ఆనాటి రాచరికమే

పూర్వకాలంలో రాజులు ప్రజలను నియంత్రించడానికి, వేరే ఆలోచనలు లేకుండా ఒకరకమైన మత్తులో ముంచెత్తడానికి మతాన్ని,వినోదాన్ని, హింసాత్మక క్రీడలను, సాంస్కృతిక వేడుకలను సాధనాలుగా చేసుకునేవారు. మతపరమైన ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తూ వాటిలో ప్రజలంతా పాల్గొనేలా చూసుకునేవారు. మతవిశ్వాసాలకు సంబంధించి బలమైన భావన పాదుకునేలా జాగ్రత్తలు తీసుకునేవారు. నా విష్ణు: పృధ్వీ పతి: అంటూ రాజుకు, దేవునికి తేడా లేదన్నట్లుగా ప్రచారం చేసి ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసేవారు. రాజు చెప్పిందే వేదం. నిరంతరం మతపరమైన పండుగలు, వేడుకలతో హేతుబద్దతను దెబ్బతీసేవారు. జంతువులతో, కత్తియుద్దాలతో హింసాత్మకమైన క్రీడా వినోదాన్ని అందిస్తూ ప్రజల ప్రవృత్తిని మానసికంగా నియంత్రించేవారు. నేర్పే విద్యలు, సాగించే ప్రచారం మొత్తమంతా రాచరికాన్ని పొగుడుతూ ప్రభుత్వానికి అండదండలిచ్చేవిదంగా కొనసాగుతుండేది. ఆధునిక ప్రజాస్వామ్య యుగంలోనూ ఇదే తంతును మన పాలకులు అనుసరిస్తున్నారు. వైజ్ఞానికమైన శాస్త్ర సాంకేతిక విషయాలను ప్రోత్సహించడం మాని మతపరమైన ఉత్సవాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఈవెంట్ మేనేజ్ మెంట్ పాత్రలోకి సర్కారు ఒదిగిపోతోంది. దీనిద్వారా ప్రజల్లో సానుకూలత సాధించాలని చూస్తోంది. ప్రజల్లో ఉండే మతపరమైన నమ్మకాలకు మద్దతు ఇవ్వడం ద్వారా వాటిని ఓట్లుగా మలచుకోవాలనే ఎత్తుగడ సాగిస్తోంది. పలుసందర్భాల్లో ఇది వికటించి ప్రజల ప్రాణాలకు చేటు తెచ్చిపెడుతోంది.

సెక్యూలర్ స్టేట్ లో ..సెంటిమెంటు రాజ్యం…

నిజానికి మనది లౌకిక రాజ్యం. నేరుగా ప్రభుత్వపాలనకు మతంతో సంబంధం ఉండకూడదు. కానీ జరుగుతున్నది దీనికి భిన్నంగా ఉంది. పితృదేవతలకు పిండప్రదానాలు, పుణ్యస్నానాలు చేసే వైయక్తిక మతవిశ్వాసం పుష్కరాలు. హైందవధార్మికతను పరిశీలిస్తే ఆద్యాత్మిక అంశాలు కూడా పుష్కరాల్లో అంతంతమాత్రంగానే కనిపిస్తాయి. కానీ గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రెండు సంవత్సరాలు పూర్తిగా నిమగ్నమై నాలుగైదు వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించింది. ఇందులో భాగస్వాములైన వేలాది ఉద్యోగులకు చెల్లించిన జీతభత్యాలు దీనికి అదనపు వ్యయం. జాతీయ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో లక్షలాదిమంది పోటెత్తారు. ఈవెంట్ ను రక్తి కట్టించడంపైనే దృష్టి పెట్టారు. సినిమా షూటింగుగా మార్చేశారు. బందోబస్తును గాలికొదిలేశారు. దాంతో గోదావరి పుష్కర తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. తాజాగా పవిత్ర సంగమం పేరిట కృష్నా,గోదావరి నదుల అనుసంధాన ప్రాంతంలో ఆధ్యాత్మిక వేడుక చేయడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు వెల్లువలా వస్తున్నారు. కృష్ణా విహారం చేసి పవిత్ర సంగమాన్ని సందర్శించుకుంటున్నారు. ఇక్కడ బోటింగుకు అవసరమైనన్ని ఏర్పాట్లు లేకపోవడంతో తాజాగా 20 మంది చనిపోయారు.

ఇదేనా సర్కారీ కర్తవ్యం….

ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల నమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి కొంత బాధ్యత ఉంది. మతపరమైన ఉత్సవాలు, వేడుకల సందర్బంగా ప్రజలకు భద్రత కల్పించడం, వారికి వసతి సదుపాయాలనివ్వడం, అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. జిల్లాకలెక్టరు ఇందుకు సంబంధించిన అధికారాలు కలిగి ఉంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ సొంత విశ్వాసాల మేరకు ఆయా వేడుకల్లో పాల్గొనడంలో తప్పులేదు. ప్రొటోకాల్ గౌరవమర్యాదలతో ఆత్మానుభూతినీ పొందవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం తన ఫెసిలిటేటర్ పాత్ర నుంచి ఆర్గనైజర్ పాత్రకు మారిపోతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు, ఉరుకులు, పరుగులు నిరంతర ప్రక్రియగా మారిపోయింది. మతపరమైన వేడుక ఏది జరిగినా సాక్షాత్తు ప్రభుత్వాధినేత రంగంలోకి దిగిపోతున్నారు. దాంతో సాధారణ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పటిష్ఠ అమలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను పక్కనపెట్టి ప్రభుత్వాధికారులు మొత్తంగా సీఎం చెప్పింది చేసేస్తే చాలనే భావనకు లోనవుతున్నారు. ఆమేరకే పని చేస్తున్నారు. ఒక రకంగా పాలన కుంటుపడుతోంది. ప్రభుత్వ నిధులతో ఈవెంట్లను మాత్రం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. విజువల్ ఎపెక్ట్స్ తో వాటిని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజల్లో వేలం వెర్రికి దారి తీస్తోంది. ఒంగోలు నుంచి వచ్చిన పర్యాటక బృందం పవిత్రసంగమాన్ని చూసి తరించాలనే తపనతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈవెంట్లను పెద్దగా చేస్తున్న ప్రభుత్వం వాటిపై ఆకర్షితులయ్యేవారి భద్రతకు పూచీకత్తు వహించడం లేదు. వారికి తగినన్ని సదుపాయాలు, రక్షణ ఏర్పాట్లు చేయడం లేదు. లైఫ్ జాకెట్లతో పాటు లైసెన్సు ఉన్న సారంగి టూరిజం బోట్లు ఉంటే 20 మంది ప్రాణాలు బలయ్యేవి కావు. భారీ నష్టపరిహార ప్రకటన, బాధిత పరామర్శలతో తమ తప్పిదం కనిపించకుండా చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు ప్రభుత్వ పెద్దలు. విచారణ కమిటీలు తూతూమంత్రంగా పుష్కరప్రమాద ఘట్టమే నిరూపించింది. ఈ నేపథ్యంలో తాజా విచారణ కమిటీ వెలికి తీసే నిజాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తులు, ఆశలూ లేవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1