జానారెడ్డిలో ఎందుకింత మార్పు?

రేవంత్ వచ్చిన వేళా విశేషమో.. ఏమో…కాని పెద్దాయన రెచ్చిపోతున్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో జానారెడ్డి తీవ్రంగానే స్పందిస్తున్నారు. గత మూడున్నరేళ్ల నుంచి శాసనసభలో జానారెడ్డి చాలా కూల్ గా కన్పించేవారు. అయితే ఈ శాసనసభ సమావేశాల్లో జానారెడ్డి చెలరేగిపోతున్నారు. రోజుకో వాయిదా తీర్మానం ఇచ్చి… దానిని చర్చకు అనుమతివ్వకుంటే వాకౌట్ చేస్తున్నారు. నిన్న ఫీజు రీఎంబర్స్ మెంట్ మీద ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారో… అనుమతించారో తెలియక ముందే సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే మిగిలిన కాంగ్రెస్ సభ్యులు కొందరు సభలోనే ఉండటం విశేషం. అలాగే ఈరోజు టీపీఎస్సీలో జరుగతున్న అవినీతిపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం చేపట్టాలో.. చేపట్టకూడదో తెలియజేస్తామని స్పీకర్ చెప్పినా జానారెడ్డి వినలేదు. సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

నాటికి… నేటికీ ఎంత తేడా?

గతంలో జరిగిన అసంబ్లీ సమావేశాలకు, ఈ సమావేశాలకు జానారెడ్డిలో తేడా కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో తనపైన ఉన్న ముద్రను చెరిపేసుకోవాలన్న ప్రయత్నంలో జానారెడ్డి ఉన్నట్లుంది. జానారెడ్డి సభలో అందరికంటే సీనియర్. ఆయనకు సీఎం కేసీఆర్ తో సహా అందరూ గౌరవిస్తారు. స్పీకర్ సయితం జానారెడ్డి మాట్లాడేందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. గతంలో జరిగిన సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేయకపోగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలను జానారెడ్డి ఎదుర్కొన్నారు. మెతకతనంగా ఉంటే లాభం లేదని, దూసుకుపోయే వారికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఆయన అనుచరులు చెప్పడంతో జానారెడ్డి సభలో దూసుకు వెళుతున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జానారెడ్డిలో వచ్చిన ఈ మార్పును చూసి కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. మొత్తం మీద జానారెడ్డి మార్పుకు కారణమేంటా? అన్న చర్చ ఇటు అధికారపక్షంలోనూ, ఇటు స్వపక్షంలోనూ తీవ్రంగానే జరుగుతుంది. రేవంత్ పుణ్యమేనంటూ చెవులు కొరుక్కునే వారు కూడా లేకపోలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*