జేసీ బ్రదర్స్…. ఏమిటీ ఘోరం?

ఒకటి కాదు..రెండు కాదు…పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రయివేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా…కేవలం ధనార్జనే ధ్యేయంగా ట్రావెల్స్ యజమానులు ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉ్నట్లు గుర్తించారు.

అతివేగమే కారణమా?

మంగళవారం తెల్లవారు జామున 5.28 గంటలకు కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజాను దాటింది. అక్కడి నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణించి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోనే ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని, అతి వేగం కూడా ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న ఈ బస్సు డ్రైవర్ ఆదినారాయణ రెడ్డి తాడిపత్రికి చెందిన వ్యక్తి. ఇంత దూరం ప్రయాణానికి కేవలం సింగిల్ డ్రైవర్ నే నియమించారంటున్నారు ప్రయాణికులు. ఓల్వో బస్సు కావడం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేశారని ప్రమాదంలో బతికి బయట పడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దాదాపు 44 మంది ప్రయాణికులు మృతి చెందారు. బస్సు దగ్దం కావడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. జబ్బార్ ట్రావెల్స్ బస్సు కూడా దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యందేనని అప్పట్లో జరిగిన విచారణలో వెల్లడయింది. అయితే ఆ బస్సును తాము విక్రయించామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాని తాజా ప్రమాదంతో దివాకర్ బస్సుల్లో ప్రయాణం ప్రమాదమని మరోసారి తేలిపోయింది.

నిబంధనలు గాలికి…

ఈ బస్సు యాజమాన్యం నిబంధనలను కూడా గాలికి వదిలేసిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ బస్సు రిజిస్ట్రేషన్ సమయంలో కాంట్రాక్ట్ క్యారియర్ గా రిజిస్టర్ అయింది. కాని ప్రయాణికులను మాత్రం ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ క్యారియర్ అంటే బస్సు బయలుదేరిన చోటనే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరినీ బస్సులోకి ఎక్కించుకోకూడదు. స్టేజీ క్యారియర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకునే వీలుంటుంది. అయితే భువనేశ్వర్ లో బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, టెక్కలి బెర్హంపూర్ లో కూడా ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు తేలింది. కేవలం సంపాదన కోసమే దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలకు నీళ్లొదిలింది. ఇదే బస్సును గతంలో ఆర్టీఏ అధికారులు పట్టుకున్నారు. మితిమీరిన వేగంతో వెళుతున్న ఈ బస్సును ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కత్తిపూడి చెక్ పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ కు జరిమానా కూడా విధించారు. అయితే ఇప్పుడు అదే బస్సు మితిమీరిన వేగంతో ప్రయాణించి 11 మంది ప్రాణాలను బలిగొంది. దీనిపై దివాకర్ ట్రావెల్స్ యజమాని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. కల్వర్టుకు గోడ లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందన్న ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మొత్తం మీద దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం ధనార్జనపై ఉన్న దృష్టి ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడంలో పెట్టడం లేదన్నది మరోసారి స్పష్టమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*