
శిల్పా సోదరులు మళ్లీ జోరుపెంచారు. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న దిశగా మళ్లీ ప్రజల్లో మమేకమవతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తర్వాత ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో మరోసారి ఓటమిని చవిచూశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత కాలం ప్రజలకు దూరంగా ఉన్న శిల్పామోహన్ రెడ్డి మళ్లీ ప్రజాసమస్యలపై దృష్టి పెట్టారు. ఎన్నికల సందర్భంగా నంద్యాలకు టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయో అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో రెండు రోజుల క్రితం సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని శిల్పా మోహన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వైసీపీ పిలుపు నిచ్చిన గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రారంభం కాగానే నంద్యాల నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. రెండు సార్లు ఓటమి చవి చూడటంతో ఈసారి సింపతీ వర్క్ అవుట్ అవుతుందని శిల్పా భావిస్తున్నారు.
విస్తృతంగా సమావేశాలు….
ఇక శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇటీవలే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవిని కూడా చక్రపాణి రెడ్డి త్యాగం చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఆయన్ను శ్రీశైలం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డి కూడా కార్యకర్తలతో సమావేశమయ్యారు. వాస్తవానికి శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీకి బలం బాగా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి వైసీపీ తరుపున బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డి మరోసారి వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద శిల్పా సోదరులు జోరు పెంచారు.
Leave a Reply