జ‌గ‌న్ ప్లాన్ మారిపోయిందిగా..!

అవును. రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల సంవ‌త్సరం ప్రారంభ‌మై పోయిన నేప‌థ్యంలో నేత‌లు అధికారం కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో అలాంటి వాటికే ప్రాధాన్యం ఇస్తారు. ఏపీలో రెండు పార్టీలు బ‌లంగా ఉన్నాయి. అధికార టీడీపీ తిరిగి అధికారం ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతోంది. ఈ క్రమంలోనే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రవేశ పెట్టింది. అనేక కార్యక్రమాల‌ను అమ‌లు చేస్తోంది. చంద్రబాబు త‌న క్రెడిబిలిటీకి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రజ‌ల్లో సంతృప్త స్థాయిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. అదేస‌మ‌యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విష‌యంలో త‌న‌దైన వ్యూహంతో వ్యవ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తార‌ని భావిస్తున్న వారికి టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అధికారం లోకి రావాలనే….

అధికార పార్టీ ఇలా వెళ్తుంటే.. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్ మాత్రం మ‌రో దారిని ఎంచుకున్నట్టే క‌న‌పడుతోంది. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు త‌న పార్టీని విడిచి చంద్రబాబు పార్టీలో చేరినా జ‌గ‌న్ మాత్రం బెదరలేదు. . వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం వైసీపీకి బాగా ఉంది. ఇప్పటికే గ‌త 2014లో అధికారం త‌ప్పిపోయిన నేప‌థ్యంలో 2019పై నేత‌లంతా ఆశ‌లు పెట్టుకున్నారు. ఆర్థికంగా నేత‌లు అంద‌రూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. సాధార‌ణంగా ఏ ప్రతిప‌క్షానికైనా… ఎదుర‌య్యే ఆర్థిక స‌మ‌స్యలే ఇప్పుడు వైసీపీని కూడా వెంటాడ‌ుతున్నాయి. అయినా గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చి అవసరమైతే వారికి ఆర్థికంగా సాయం చేయాలన్నది జగన్ అభిప్రాయం.

నమ్ముకున్నా సరే…..

వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ వారి గెలుపు సర్వేల్లో కష్టమని తేలితే వారికి టిక్కెట్ ఇవ్వరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మంచి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అంతే తప్ప ఓడిపోతారని తెలిసినా తనను నమ్ముకున్నారన్న ఏకైక కారణంతో టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీని ఇన్నాళ్లూ నమ్ముకున్న వారు అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఎవరైనా కోరుకుంటారు. మరి జగన్ టిక్కెట్లు కేవలం గెలుపు గుర్రాలకే ఇస్తే వీరి మాటేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. జగన్ అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని హామీ ఇచ్చినా టిక్కెట్లు దక్కని వారు ఊరుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద సర్వే రిపోర్ట్ ల ప్రకారమే టిక్కెట్ల కేటాయింపులు ఉంటాయన్న విషయాన్ని జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టం చేశారు.