టీఆర్ఎస్‌కు ఆ గండం త‌ప్ప‌దా?

రిజర్వేషన్ల గండం నుంచి బయటపడేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నానాతంటాలు పడుతోంది. గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చి రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది. కథంతా ఇక్కడి వరకు సవ్యంగానే సాగింది. టీఆర్ఎస్ కు ఇక్కడి నుంచే గండం మొదలైంది. ఇప్పటివరకు మైనారిటీ లకు నాలుగు శాతం, ఎస్టీలకు ఆరుశాతం రిజర్వేషన్ అమల్లో ఉంది.

బలమైన కారణాలతో….

అయితే ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే.. మైనారిటీ రిజర్వేషన్ ను 12శాతానికి, ఎస్టీ రిజర్వేషన్ల‌ను 10శాతానికి పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు అసెంబ్లీలో సయితం బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్ 50 శాతానికి మించొద్దనీ..ఒకవేళ రిజర్వేషన్ పెంచాల్సిన అసాధారణ పరిస్థితులు ఉంటే అందుకు బలమైన కారణాలు తెలపాలంటూ పలుమార్లు రాష్ట్రానికి పంపిన లేఖలు పంపిందనీ.. రాష్ట్ర ప్రభుత్వమే ఇంతవరకూ జవాబు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో చెప్పడంతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

లేఖలు బయటపెట్టడంతో….

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన లేఖలను కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంతో టీఆర్ఎస్ ఇరుకున పడింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కారణాలు చూపాలని కేంద్రం పలుమార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రతి పక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఓ పత్రిక ప్రముఖంగా ప్రచురించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ లేఖలకు స్పందించకుండా.. రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ లోక్ సభ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తూ మైనారిటీ, ఎస్టీ వర్గాలను మభ్యపెడుతోందనే వాదనకు బలం చేకూరుతోంది.

ఇచ్చిన మాట ప్రకారం…

అలాగే.. గత సమావేశాల్లో ఫైట్ చేయకుండా ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాల్లో రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని ఆందోళన చేయడం హాస్యాస్పదమనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ వైఖరిని మైనారిటీ, ఎస్టీ వర్గాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ ఇచ్చిన మాట ప్రకారం.. రిజర్వేషన్లు పెంచలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదనే వాదనకూడా వినిపిస్తోంది. టీఆర్ఎస్ ఈ గండం నుంచి ఎలా బయట పడుతుందో చూడాలి మరి.