టీఆర్ఎస్ చెంత‌కు రేవంత్ న‌మ్మిన‌బంటు…!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నే మాట స‌హ‌జంగానే వినిపిస్తూ ఉంటుంది. చెట్టాప‌ట్టాలేసు కుని తిరిగిన వారు త‌ర్వాత విమర్శ‌లు చేసుకుంటారు.. విమర్శ‌లు చేసుకున్న వారు దోస్తుల్లా తిరుగుతుంటారు! ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఇటువంటి ప‌రిణామాలే చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలో క‌లిసి మెలిసి తిరిగిన నాయ‌కులు చెరో దారి వెతుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ క‌లిసి ప‌నిచేసినా.. ఇప్పుడు మాత్రం క‌లిసి అడుగులు వేయ‌లేక‌పోతున్నారు. ఒక‌రు టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్‌లోకి వెళితే.. మ‌రొక‌రు త‌న స్నేహితుడు తీవ్రంగా వ్య‌తిరేకించే టీఆర్ఎస్‌లోకి చేరేందుకు అడుగులు వేస్తున్నారు. అంతేగాక రేవంత్‌ను దెబ్బ‌కొట్టేందుకు టీఆర్ఎస్ అధినేత వేసిన మాస్ట‌ర్ ప్లాన్‌లో వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి ప‌డిపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇద్దరూ మంచి మిత్రులే….

టీటీడీపీలో రేవంత్‌రెడ్డి-వంటేరు ప్ర‌తాప్ రెడ్డి దోస్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.రేవంత్ ముఖ్య అనుచ‌రుడిగా వంటేరుకు మంచి పేరు ఉంది. ఇద్ద‌రూ టీఆర్ఎస్‌ను తీవ్రంగా ద్వేషించేవారు. అంతేగాక టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డేవారు. రేవంత్‌తో స‌మానంగా టీఆర్ఎస్‌పై ఎక్కువ దూకుడుగా ఉండేవారు వంటేరు. కానీ ఎస్సీకి సీఎం పీఠం ఇస్తాన‌ని వెల‌మ కుల‌స్తుడు మాట‌త‌ప్పాడంటూ… కేసీఆర్‌ను కుల చిచ్చులోకి లాగాల‌ని కూడా ప్ర‌య‌త్నించారు. అయితే టీటీడీపీలో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. రేవంత్.. సైకిల్ దిగి కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. దీంతో వంటేరు ప్ర‌తాప‌రెడ్డి కూడా ఆయ‌న బాట‌లోనే వెళ‌తార‌ని అంతా భావించారు.

కాంగ్రెస్ లోకి వెళతారని….

కానీ వంటేరు మాత్రం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం! ఇటీవ‌ల తన నియోజకవర్గంలో ఒక స్థానిక కాంగ్రెస్ నేత ఇంట్లో కార్యానికి హాజరైన టీ కాంగ్రెస్ ముఖ్యులతో వంటేరు చ‌నువుగా తిరిగారు. వారికి ఆహ్వానాలు పలక డం నుంచి, వీడ్కోలు చెప్పే వరకు ఎక్కడ చూసినా ప్రతాప్ రెడ్డే కనిపించారు. దీంతో ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకో వడం ఖాయమ‌ని, రేవంత్ వెన‌కాల వెళ్ల‌డం స్ప‌ష్ట‌మ‌ని టీడీపీతో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా భావించారు. కానీ ఆయ‌న మాత్రం తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయ‌న సుముఖంగా లేర‌ని ఆయ‌న స‌న్నిహి తులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఆయ‌నకు ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింద‌ని తెలుస్తోంది.

మెదక్ సీటు ఇస్తారా?

గ‌త ఎన్నిక‌ల నుంచి అధికార‌పార్టీ, వంటేరు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. కానీ, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు మారుతుంటాయని స‌ర్దిచెప్పుకున్నార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో వంటేరు గ‌జ్వేల్‌లో పోటీ చేసి కేసీఆర్‌పై ఓడిపోయారు. అయితే, ఆయ‌న్ను పార్టీలోకి తీసుకుని మెద‌క్ ఎంపీ సీటు ఆఫ‌ర్ చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. మెద‌క్ ఎంపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వంటేరు టీఆర్ఎస్‌లోకి వ‌స్తే గ‌జ్వేల్‌లో ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ బ‌లం మ‌రింత‌గా పెరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*