టీఆర్ఎస్ లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే… సీన్ ర‌స‌వ‌త్త‌రం

అధికార పార్టీలో ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య వివాదాలు, విభేదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎంపీకి స్థానిక ఎమ్మెల్యే చుక్క‌లు చూపించిన వైనం బ‌య‌ట‌ప‌డింది. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణాను బంగారు మ‌యం చేస్తామ‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను మారుస్తాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న తెలంగాణ సార‌ధి, సీఎం కేసీఆర్‌కు చెందిన టీఆర్ ఎస్‌పార్టీలో నేత‌లు ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే ఫైట్ చేసుకుంటున్నారు. అల‌క‌లు పోయి, ఏకంగా మాట‌ల వ‌ర‌కు విష‌యాలు చేరుకున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. తొలిసారి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వరంగ‌ల్ ఎంపీ స్థానాన్ని కైవ‌సం చేసుకున్న ప‌సునూరి ద‌యాక‌ర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మధ్య వర్గపోరు తాజాగా వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షిగా చోటుచేసుకున్న పొరపాటు అధికార పార్టీలో కొత్త సమస్యలకు కారణమైంది.

ఫ్లెక్సీలో బొమ్మ లేదని…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పశువైద్య కాలేజీని వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మామునూరులో ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు మామునూరులో కాలేజీ భవన సముదాయం నిర్మాణానికి ఇటీవ‌ల శంకుస్థాప‌న చేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సభ జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీనికి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు చందూలాల్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్‌ ఫొటోలు ముద్రించారు. వరంగల్‌ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ పసునూరి దయాకర్‌ ఫొటో ముద్రించలేదు.

కావాలనే చేశారంటున్న…

శంకుస్థాపన కార్యక్రమం మొదలుకావడానికి ముందే ఎంపీ దయాకర్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కడియం శ్రీహరి, మంత్రి తలసాని కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కావాల‌నే ఫ్లెక్సీలో త‌న ఫొటో లేకుండా చేశార‌ని ఎంపీ వ‌ర్గం అంత‌ర్గ‌తంగా ఆరోప‌ణ‌లకు దిగింది. ఇక‌, ఎంపీ పసునూరి దయాకర్‌ అసంతృప్తి విషయం తెలియడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేదిక వద్దకు రాలేదు. భూమి పూజ ముగిసిన అనంతరం శిలాఫలకం ఆవిష్కరించి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోయారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కడియం శ్రీహరి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మామునూరు కార్యక్రమంలోనే ఉండాలి.

పాత విభేదాలే…

మొత్తానికి ఈ వ్య‌వ‌హారం తీవ్ర వివాదానికి దారితీసేలా ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య ఆధిప‌త్య పోరే ఈ వివాదానికి కార‌ణ‌మ‌ని స్ఫ‌ష్టంగా తెలుస్తోంది. పసునూరి దయాకర్‌ 2013 వరకు వర్ధన్నపేట టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అనంతరం అరూరి రమేశ్‌ చేరికతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయనకు వర్ధన్నపేట ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సాధారణ ఎన్నికల్లో రమేశ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో దయాకర్‌ ఎంపీగా గెలిచారు. ఇద్దరు ముఖ్యమైన పదవుల్లో ఉన్నా.. పాత విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మ‌రి వీటిపై గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*