టీఆర్ఎస్ లో వీళ్లున్నారా? లేదా?

అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల గొంతులు మూగబోయాయి. ఉద్యమ సమయంలో పార్టీలపై దుమ్మెత్తిపోసిన నేతలు అధికారంలోకి రాగానే వారి వాయిస్ బయటకు రావడం లేదు. ఇది దేనికి సంకేతం? అధినేత కేసీఆర్ వ్యవహార శైలివల్లనేనా? లేక పార్టీలో జరుగుతున్న పరిణామాలేనా? నిన్నమొన్నటి వరకూ విపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడు కామ్ అయిపోయారు. పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా వారు పెదవి విప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం అసంతృప్తేనని తెలుస్తోంది. కేవలం సీనియర్ నేతలే కాదు మంత్రులదీ అదే దారి. ఎందుకొచ్చిందిలే…అనవసరంగా విపక్షాలపై విమర్శలు చేసి తాము ఇబ్బందుల్లో పడటం అనుకున్నారో….ఏమో టీఆర్ఎస్ అధినేత కుటుంబంపై విమర్శలు చేసినా పట్టించుకోవడం మానేశారు. తమ శాఖకే పరిమితమయ్యారు.

మంత్రుల నుంచి విప్ ల వరకూ…….

మంత్రులు, సీనియర్ నేతలు, విప్ ల వరకూ ఇదే పరిస్థితి. మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి వంటి నేతలు ఏడాది క్రితం వరకూ యాక్టివ్ గానే ఉండేవారు. ప్రతిపక్షాల విమర్శలను వెంటనే తిప్పికొట్టేవారు కాని ఇప్పుడు వారు కూడా ఏం మాట్లాడని పరిస్థితి. ఇక ఎమ్మెల్యేల్లో ఉత్సాహంగా మైకుల వద్దకు వచ్చే శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి వంటి నేతలు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ మైకు వీరులు ఇద్దరే అయ్యారు. వారు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ లు మాత్రమే. ఈ ఇద్దరి గొంతులు తప్ప టీఆర్ఎస్ లో మరెవరి వాయిస్ విన్పించడం లేదు. ఆదిలాబాద్ ఎంపీ బాల్క సుమన్ అప్పుడప్పడూ స్పందిస్తున్నా ఆయన ఢిల్లీకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. ఇక చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు గంపా గోవర్థన్, గొంగిడి సునీతలు వారి నియోజకవర్గాలకే పరిమితమై విపక్ష విమర్శలను తిప్పికొట్టడంపై శ్రద్ధ పెట్టడం లేదు. కేటీఆర్ కు చెందిన కంపెనీ ద్వారా పోలీసు వాహనాలు కొనుగోలు చేయడం, నేరెళ్ల సంఘటన, మియాపూర్ భూకుంభకోణం వంటి సీరియస్ విషయాల్లోనూ వీరు సైలెంట్ గానే ఉండటం విశేషం. మంత్రి పదవులను ఆశించిన వారు రాకపోవడంతో కొందరు… మంత్రిపదవులో ఉన్నా తమకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వకపోవడంతో మరికొందరు ఇలా ఎవరికి వారే తమ పని తాము చూసుకుంటున్నారు తప్ప పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదన్న విమర్శ విన్పిస్తోంది. అనవసరంగా గొంతు చించుకుని ప్రయోజనం లేదని వారు సైలెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో కాంగ్రెస్ చేసే విమర్శలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చే నేత కూడా కరువయ్యారు టీఆర్ఎస్ లో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*