టీటీడీ బోర్డులోనూ ప‌వ‌న్ సిఫార్సులు..!

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి విష‌యంలోనూ జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిక‌మెండేష‌న్లు చేస్తున్నారా ? త‌ను సూచించిన వ్య‌క్తికి స‌భ్యుడిగా నియామ‌కం క‌ల్పించాల‌ని బాబును ప‌వ‌న్ కోర‌నున్నారా? అంటే ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. 2014లో టీడీపీ-బీజేపీ మిత్ర ప‌క్షానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది. దీంతో అప్ప‌టికే పార్టీని ప్ర‌క‌టించినా.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి వెళ్ల‌కుండా ప‌వ‌న్ ప్ర‌చారానికే ప‌రిమిత‌మ‌య్యారు.

పవన్ లేవనెత్తిన సమస్యలపై….

ఇక‌, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌భుత్వానికి విన్న‌పాలు చేస్తూ.. వాటిని ప‌రిష్క‌రిస్తూ.. వ‌చ్చారు. రాజ‌ధాని రైతులు, శ్రీకాకుళం కిడ్నీ బాధితులు, తుందుర్రు ఆక్వా బాధితులు ఇలా స‌మ‌స్య ఏదైనా ప్ర‌భుత్వంతో చ‌ర్చించి వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కం విష‌యంలోనూ ప‌వ‌న్ సిఫార‌సు చేశారు. అప్ప‌ట్లో తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్‌ను ప‌వ‌న్ స‌భ్యుడిగా సిఫార్సు చేశారు. దీంతో ఆయ‌నకు చంద్ర‌బాబు వెంట‌నే టీటీడీ బోర్డులో సీటు క‌ల్పించారు. అయితే, ఆయ‌న నియామ‌కం త‌ర్వాత కొన్ని విమ‌ర్శ‌లు వెలుగు చూశాయి.

హరిప్రసాద్ కు మరోసారి….

ఈ విమ‌ర్శలు ఆధారాల‌తో స‌హా ప‌త్రిక‌ల‌కు ఎక్కాయి. హ‌రిప్ర‌సాద్ స‌న్నిహితులు కొంద‌రు ఈయ‌న పేరును అడ్డు పెట్టుకుని సేవా టికెట్ల‌ను విక్ర‌యించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, వీటి మాట అలా ఉంచితే త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు మ‌ళ్లీ టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తున్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి హ‌రిప్ర‌సాద్ వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తిరిగి ఆయ‌న‌ను బోర్డు స‌భ్యునిగా నియ‌మించేందుకు బాబు అంగీక‌రించే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో హ‌రిప్ర‌సాద్ మాత్రం.. తాను మ‌రోసారి బోర్డు స‌భ్యుడు అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌తో మ‌రోసారి సిఫార‌సు చేయించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్న‌ట్టు తాజాగా అందుతున్న స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1