టీడీపీకి గండి కొడ‌తా…ప‌వ‌న్ డైరెక్ట్ వార్నింగ్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు టీడీపీ అంటే సాఫ్ట్ కార్న‌ర్ ఉందనే విష‌యం ఇప్ప‌టివ‌ర‌కూ అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన దగ్గ‌ర నుంచి నిన్న మొన్న‌టి స‌భ‌ల్లోనూ టీడీపీపై సునిశితంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారే త‌ప్ప‌.. లోతైన, ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. కానీ ఆయ‌న ఏపీ ప‌ర్య‌ట‌నలో భాగంగా మూడో రోజు టీడీపీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంతేగాక టీడీపీ నేత‌ల‌కు ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు కూడా జారీచేశాడు. 2014లో టీడీపీ విజ‌యావకాశాల‌కు గండి కొట్ట‌కుండా ఉన్నాన‌ని, అవ‌స‌ర‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ.. ఆయ‌న చేసిన కామెంట్స్ రాజ‌కీయ వేత్త‌ల‌తో పాటు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తున్నాయి.

తాను ఎవరికీ తొత్తుకాదన్న….

తాను ఏ పార్టీకీ తొత్తుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే విషయాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒక పద్ధ‌తి ప్ర‌కారం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాడు జ‌న‌సేనాని. ఇన్నాళ్లూ టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాడ‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఘాటుగానే స్పందిస్తున్నారు. చ‌లొరే చ‌లొరే చ‌ల్ స‌భ‌ల ద్వారా త‌న ఆశ‌యాలు, రాజ‌కీయాల ప‌ట్ల త‌న వైఖ‌రి, జ‌న‌సేన‌, ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యం వంటి అంశాలను వివ‌రిస్తున్నాడు. మూడు రోజుల పర్య‌ట‌న‌లో ఎన్నో అంశాల‌ను పంచుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు టీడీపీపై ట్రిగ్గ‌ర్ ఎక్కుపెట్టార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇందుకు ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.

టీడీపీకి పరోక్ష సంకేతాలు…

`అవసరమైతే ఆయుధం కూడా పట్టగల సత్తా ఉన్నవాడిని మరిచిపోకండి. తెలుగుదేశం విజయవకాశాలకు అప్పట్లోనే గండి కొట్టగలగి ఉండేవాడిని. కానీ చేయలేదు. ఎందుకు? జల్సాలో ఒక డైలాగ్ ఉంది. “చేతిలో కత్తి ఉండి.. చంపడానికి కారణాలు ఉండి.. తెగ నరకడానికి తల ఉండి.. చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది. మీకుందా!” తెలుగుదేశం పార్టీకి ఇంకోసారి గండికొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి’ అని పవన్ హెచ్చరికలు జారీ చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల వెనుక ఆయ‌న ఉద్దేశం ఏంట‌నేది ఇంకా తెలియ‌క‌పోయినా.. ప్రస్తుతానికి టీడీపీకి వార్నింగ్ ఇచ్చాడంటున్నారు విశ్లేష‌కులు!

పదో తరగతిలోనే…

వేలకోట్లు లేకుండా, వెనకాల మేథావులు లేకుండా ఒక కలతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ఆశయాలు కేవలం పేపర్లకే పరిమితం అనుకునే ప్రస్తుత ప్రపంచంలో వాటిని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే జనసేన పెట్టానని స్పష్టం చేశారు. నెల్లూరులో పదో తరగతి చదువుతున్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. ‘భయాలు ఉంటాయి.. ఒత్తిళ్లు ఉంటాయి.. మూడున్నర సంవత్సరాలుగా నువ్వు పార్టీని ఏం నడిపించావ్?.. పాలక వర్గాల మద్దతు లేదు, పెద్ద మనుషులు లేరు.. లింగు లిటుకుమంటూ ఏం చేస్తావన్నారు. కానీ ఒక్కడితోనే ప్రపంచం కదులుతుంది మార్పు వస్తుంది..’ అన్నారు పవన్.

అందరూ కలిసి వస్తే….

హోదా గురించి ప్రస్తావిస్తూ.. ‘హోదాపై ఎందుకు పోరాటం చేయలేదని నన్ను ప్రశ్నిస్తున్నారు?.. కానీ నేనొక్కడినేనా పోరాటం చేయాల్సింది అనుకున్నపుడు ప్రజలు సిద్దంగా ఉన్నారా?.. అని ఆలోచించానన్నారు. ‘తెలంగాణ ప్రజలంతా కోరుకుంటే.. ‘మా తెలంగాణ’ అనుకుంటే వాళ్లకు రాష్ట్రం వచ్చింది. కానీ హోదా ఉద్యమానికి మీరు సిద్దంగా ఉన్నారా? ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయా?.. తెలుగుదేశం, వైసీపీ సిద్దంగా ఉన్నాయా?..’ అని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం వద్దకు ఉద్యమాన్ని తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. అయినా సరే, మా గోడును పట్టించుకోని ప్రధానమంత్రి అని చెప్పడానికి నేను భయపడను. ఇది వ్యక్తిగత కోరిక కాదు. కోట్ల మందికి ప్రామిస్ చేశాను.’ అని చెప్పుకొచ్చారు.

టీడీపీ నేతలే ప్రచారం….

‘పరిటాల రవి అనే వ్యక్తి తమ్ముడు సినిమా షూటింగ్ సమయంలో గుండు కొట్టించారని ఒక ప్రచారం తిప్పారు. ఓరోజు పేపర్ బ్యానర్ ఐటెంగా వచ్చింది. అప్పుడొచ్చాను రోడ్డు పైకి. నేనెప్పుడూ దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తాను. నేనేమైనా చేతకాని వాజెమ్మ అనుకున్నారా?.. ఉప్పు కారం తింటున్నవాడిని.. చాలా పౌరుషం ఉంది నాకు. నా నిగ్రహం చేతకాని తనం కాదు. సంయమనం.’ అని ఆవేశంగా మాట్లాడారు. ‘స్వచ్చ భారత్ క్యాంపెయిన్‌కు రావచ్చు కదా అని అడిగారు. బయట మురికిని కడగగలం కానీ మనసుల్లోని మకిలి, మలిని, అజ్ఞానం, గాఢాంధాకరం ఎవరు కడగాలి?.. అలాంటి మకిలి లేని, మలినాలు లేని రాజకీయాలను జనసేన తెస్తుంది. అదే ఛలోరే ఛల్.. ఉద్దేశం’ అని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*