టీడీపీది గోదారిలో ఎదురీతేనా …?

పవన్ కళ్యాణ్ జనసేన టిడిపికి రాబోయే ఎన్నికల్లో జెల్ల కొట్టేసింది అని స్పష్టం అయ్యింది. జనసేన తో స్నేహాన్ని గాఢంగా కోరుకున్న టిడిపికి గట్టి షాక్ ఇచ్చే జిల్లాలు ప్రధానంగా రెండు. అవే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ రెండు జిల్లాలనుంచి గత ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు 29 స్థానాలను టిడిపి బిజెపి కైవసం చేసుకున్నాయి. అలాగే ఐదు పార్లమెంట్ స్థానాలకు టిడిపి నాలుగు, బిజెపి ఒకటి పట్టుకుపోయాయి. ఇప్పడు పవన్ దూరం అయ్యారు. సామాజిక సమీకరణాలు వ్యతిరేకంగా వున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అధికార పార్టీతో కలిసి ఎన్నికల్లో నడిచేందుకు సిద్ధంగా లేని వామపక్షాలు. ఇలా అన్ని దుశ్శకునాలు తెలుగుదేశాన్ని గోదావరి జిల్లాలో వెక్కిరిస్తున్నాయి.

పవన్ గుంటూరు సభ తరువాత ….

పవన్ కళ్యాణ్ గుంటూరు లో నిర్వహించిన జనసేన ప్లీనరీ తరువాత తెలుగు తమ్ముళ్ళు గోదావరి జిల్లాలపై వ్యూహరచన మొదలు పెట్టేశారు. 2019 ఎన్నికలను ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాల ఎత్తుగడలను అనుసరించాలని టిడిపి నిర్ణయించింది. జనసేన పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ పార్టీ ఎంపిక చేయబోయే అభ్యర్థులను తమ పార్టీలోకి చివరిక్షణంలో చేర్చుకునేందుకు ఒక కార్యాచరణ సిద్ధం అవుతుంది. మరోవైపు ప్రజలకు మరింత చేరువగా పార్టీ క్యాడర్ వుండాలని కూడా ఇప్పటికే అధినేత దిశా నిర్ధేశం చేశారు. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టాలని ఇంటెలిజెన్స్ కి అదనపు బాధ్యతలను పెడుతూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి అంటున్నారు. జనసేన, వైసిపిలోకి వెళ్లేవారు ఎవరు ? ఎవరు టికెట్ రేసులో ఉన్నారు. ఆ ప్రాంతంలో వున్న సామాజిక స్థితిగతులు పవన్ సామాజిక వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే సామాజిక వర్గాల్లో బలమైన నేతలు ఎవరు వంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయి టిడిపి వర్గాలు.

ఆశ నిరాశ నడుమ టిడిపి …

టిడిపి లో ఇప్పుడు మరో గుబులు వెంటాడుతుంది. అదే చాలా నియోజకవర్గాల్లో ఎమ్యెల్యేల్లో పెరిగిన అవినీతి ప్రజల్లో బాహాటంగా నలుగుతుంది. ఆయా స్థానాల్లో సిట్టింగ్ లకు సీట్లు ఇస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లు పార్టీ సర్వేలు తేలుస్తున్నాయ్. ఆ క్రమంలో సిట్టింగ్ ఎమ్యెల్యేలకు సీటు ఇస్తే ఒక తంటా ఇవ్వకపోతే రెబెల్స్ గా వారు బరిలోకి నిలిచి పార్టీకి దెబ్బకొట్టే ఛాన్స్ లు వుండే వాతావరణం అధికార పార్టీని వణికించబోతుంది. దీనికి తోడు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అంటూ వచ్చిన వారిని రానివారిని కూడా పార్టీలో టికెట్ హామీతో చేర్చుకోవడం కూడా అధికారపార్టీకి చేటు తెచ్చేలా మారింది. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా టికెట్ రేసులో ఇద్దరు నుంచి ఐదుగురు వరకు అధికారపార్టీ తరపున బలమైన నేతలు సిద్ధం అవ్వడం మరో రకమైన ఆందోళన రేకెత్తిస్తుంది. ఇలా 2014 లో టిడిపి విజయం లో కనిపించిన సానుకూలతలన్నీ అపసవ్య దిశలో పసుపు పార్టీకి ఎదురు రావడాన్ని రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన వేసే ప్రతి ముందడుగు టిడిపి కి తీరని నష్టం రాజకీయంగా తెచ్చిపెట్టేదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*