టీడీపీ అవినీతిపై వైసీపీ వ్యూహమిదే

వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. సోమవారం పార్లమెంటు సభ్యులతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం నుంచి తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో జగన్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

తాము గతంలోనే ఫిర్యాదు చేసినా….

టీడీపీ చేస్తున్న అవినీతిని తాము ఎన్నాళ్ల నుంచో ఎండగడుతున్నా పట్టించుకోలేదని, పట్టిసీమ అవినీతి ఇప్పుడు బీజేపీ నేతలు బయటపెడుతుండటంతో వైసీపీలో కొంత జోష్ వచ్చింది. పట్టిసీమ, ఉపాధి హామీ నిధుల విషయంలో అవకతవకలు జరుగుతున్న తీరుపై గతంలోనే వైసీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే ఆరోజు తమను అభివృద్ధి నిరోధకులుగా చంద్రబాబు అండ్ టీం చిత్రీకరిస్తూ ప్రజల దృష్టి మరిల్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోసారి కేంద్రానికి ఫిర్యాదు….

ఈ నేపథ్యంలో పట్టిసీమ, ఉపాధి హామీ నిధుల్లో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అవినీతి, అవకతవకలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. జన్మభూమి కమిటీల పేరుతో జరుగుతున్న దోపిిడీ, మరుగుదొడ్ల మాటున జరిగిన కోట్ల రూపాలయ అవినీతిని ప్రజల ముందుంచాలన్నది వైసీపీ లక్ష్యంగా ఉంది. గతంలో తాము ఆరోపణలు చేస్తే టీడీపీ గొంతునొక్కే ప్రయత్నం చేసిందని, ఇప్పుడు జనసేన, బీజేపీ అవే ఆరోపణలు చేస్తుంటే ముప్పేట దాడి జరుగుతుందని తప్పించుకోవాలని చూస్తుందని వైసీపీ భావిస్తోంది.

ఉద్యమ కార్యాచరణపై….

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఈ సమావేశంలో జగన్ చర్చించనున్నారు. దీంతోపాటు పార్టీ భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లడమే మార్గమమని జగన్ భావిస్తున్నారు. బీజేపీ కూడా ప్రత్యేక హోదా లేదని తేల్చి చెప్పడంతో భవిష్యత్ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై జగన్ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*