టీడీపీ ఆశలకు గండికొట్టిన పవన్

పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించారు. 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టత నిచ్చారు. 175 స్థానాలంటే ఒక్క ఏపీలోనే అనుకుంటే పొరపాటే….. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టతనిచ్చారు. తమకు బలం ఉన్న నియోజక వర్గాల్లోనే బరిలో దిగుతామని చెప్పారు. జనసేన పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి పవన్‌ ప్రకటన చేశారు. మన బలం 175 ఉంటే 175 స్థానాలకే పోటీ చేద్దామని., బలం ఎంతుంటే అంత., తెలంగాణ సహా అన్ని చోట్ల పోటీ చేద్దామని., బలం ఎంతో అంతే చేద్దామని చెప్పారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేయాలని పవన్ స్పష్టతనివ్వడంతో వాటిలో ఏ నియోజక వర్గాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీతో జట్టు కడతారు అనేది ఉత్కంఠగా మారింది.

పవన్ పార్టీ 175 స్థానాలకు సై…

అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అంటే ఏపీలోని అన్ని స్థానాల్లో పవన్ పార్టీ పోటీ చేయబోదన్న మాట. ఏపీలోనే 175 శాసనసభ స్థానాలున్నాయి. అంటే ఎక్కువగా చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లోనే ఎక్కువగా పవన్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకోరని అర్ధమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే బరిలోకి దిగుతారని అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ కూడా పవన్ పట్ల సానుకూలంగా ఉంది. పవన్ లేవనెత్తే సమస్యలన్నింటినీ పరిష‌్కరించే దిశగా ప్రయత్నిస్తుంది. కాని టీడీపీ ఆశలకు పవన్ గండికొట్టినట్లే కన్పిస్తోంది.