తండ్రికి ఎంపీ… కూతురికి ఎమ్మెల్యే సీట్లు… కేసీఆర్ హామీ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తండ్రి, కూతుళ్లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు సీట్లపై హామీ వ‌చ్చిందా ? 2019 ఎన్నిక‌ల్లో తండ్రి ఎంపీగాను, కూతురు ఎమ్మెల్యేగాను పోటీ చేస్తారా ? అంటే మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో అవున‌న్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. డోర్నక‌ల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కాలం కలిసొస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు, ఆయన కూతురు మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టికెట్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో….

కాంగ్రెస్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అయిన రెడ్యానాయ‌క్ 2009లో కాంగ్రెస్ త‌ర‌పున డోర్నక‌ల్‌లో ఓడిపోగా, అదే టైంలో మానుకోట నుంచి పోటీ చేసిన ఆయ‌న కుమార్తె క‌విత మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. డోర్నక‌ల్‌లో రెడ్యా నాయ‌క్ గెలిస్తే, మానుకోట‌లో మాత్రం క‌విత ఓడిపోయారు. ఎన్నిక‌ల త‌ర్వాత వీరిద్దరు గులాబీ గూటికి జంప్ అయిపోయారు.

పార్లమెంటు సీటు రెడ్యాకు….

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఇద్దరికి టిక్కెట్లు కావాల‌ని కొద్ది రోజులుగా రెడ్యా కేసీఆర్ ద‌గ్గర ప‌ట్టుబ‌డుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈసారి రెడ్యానాయక్ కు అవకాశం ఇచ్చి, డోర్నకల్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ ను బరిలో నిలుపుతారని అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే మానుకోట సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను తప్పించి కవితకు అవకాశం ఇస్తారని, ఈమేరకు తండ్రీతనయలకు టీఆర్ఎస్ కీలక నేతల నుంచి సంకేతాలు కూడా అందినట్లు జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది.

కేసీఆర్ హామీతో….

ఇదిలా ఉంటే మానుకోట సిట్టింగ్ ఎంపీ, ప్రొఫెసర్ సీతారాంనాయక్ నియోజకవర్గ పరిధిలో ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో సంబంధాలు లేేేని ప్రజాప్రతినిధిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో పార్టీ కి నష్టం వాటిల్లిందని సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెడ్యానాయక్ కు అవకాశం ఉంటుందని, సీట్ల సర్దుబాటు కూడా సులభమవుతుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని పలువురు కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మానుకోట సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ విమ‌ర్శలు ఎదుర్కోవ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించి, అక్కడ నుంచి క‌విత‌కు, డోర్నక‌ల్‌లో రెడ్యాకు వియ్యపురాలు అయిన స‌త్యవ‌తి రాథోడ్‌కు అసెంబ్లీ సీట్లు ఇస్తార‌ని పార్టీ వ‌ర్గాల టాక్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*