తంబిలను చూసి నేర్చుకోండి తమ్ముళ్లూ…!

తమిళనాడును చూడండి… కేంద్రంపై భగ్గుమంటోంది. కావేరి జలాల మండలిని ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వెంటనే కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాల్సిందేనంటూ పెద్దయెత్తున నినదించారు. పార్టీల కతీతంగా అందరూ ఏకమై ఆందోళనకు దిగారు.

అన్ని పార్టీలూ ఏకమై….

అన్నాడీఎంకే గత పది రోజులుగా పార్లమెంటు ఉభయ సభలను స్థంభింప చేస్తున్న సంగతి తెలిసిందే. కావేరీ జలాల బోర్డు కోసమే వారు ఆందోళన చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం గత నెల 29వ తేదీలోగా కావేరి బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం పట్టించుకోలేదు. తమకు కొంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కర్ణాటక ఎన్నికలు ఉండటంతోనే కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటులో తాత్సారం చేస్తుందన్నది అందరికీ తెలిసిందే.

తమిళనాడులో తీవ్రమైన ఆందోళనలు….

అయితే కేంద్రంపై వత్తిడి పెంచడానికి తమిళనాడులో అన్ని పార్టీలూ ఏకమయ్యాయి. ఈనెల 5వ తేదీన తమిళనాడు బంద్ ను ప్రకటించాయి విపక్షాలు. సోమవారం చెన్నై తో పాటు అనేక నగరాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. రైల్ రోకోలు చేపట్టారు. ఈరోజు రైతు సంఘాలు, వ్యాపార వర్గాలు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చాయి. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై కోర్టు థిక్కార కేసును వేసింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం థిక్కారం చేస్తుందని ఈ కేసు వేసింది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 9న విచారణకు రానుంది. ఈరోజు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనుంది.

ఈరోజూ ఉభయ సభల్లో….

తమిళనాడులో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఈరోజు కూడా అన్నాడీఎంకే సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పార్లమెంటులో తాము మౌనంగా ఎలా ఉంటామని అన్నాడీఎంకే సభ్యులు అంటున్నారు. దీంతో ఈరోజు కూడా సభ యధాతధంగానే వాయిదా పడే అవకాశాలున్నాయి. ఆందోళనలు చేస్తున్న సభ్యులను సస్పెండ్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. దీంతో ఈరోజు కూడా అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం లేదంటున్నారు. తమిళనాడును చూసైనా ఏపీ నేతలు నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*