తప్పంతా మోడీదే

pawankalyan janasenaparty

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను పవన్ కల్యాణ్ పరిశీలించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం నివేదికలో తప్పంతా కేంద్రానిదేనని తేల్చినట్లు తెలుస్తోంది. ఏపీ విభజన హామీలను సక్రమంగా అమలు పర్చలేదని జేఎఫ్ సి నిర్ధారించింది. కేంద్రం సాయం చేసిందంతా ఇతర రాష్ట్రాలతో పాటు చేసిందేనని, ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం అంటూ ఏమీ లేదని కమిటీ అభిప్రాయపడింది.

పూర్తి స్థాయిలో అధ్యయనం…..

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ లు సభ్యులుగా ఉన్నారు. వీరు గత పది రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్రానికి వచ్చిన నిధులు, విభజన హామీలు ఏమేరకు అమలయ్యాయన్న దానిపై అధ్యయనం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు అరకొర సాయమేనని కమిటీ అభిప్రాయపడింది. శాఖల వారీగా లెక్కలు చూసిన కమిటీ చివరకు కేటాయింపులు తక్కువే జరిగినట్లు నివేదిక రూపొందించినట్లు తెలిసింది.

అరకొర నిధులతో….

ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఎటువంటి సాయం కూడా ఆంధ్రప్రదేశ్ కు అందలేదని కమిటీ నిర్ధారించినట్లు తెలిసింది. కేంద్రం చెబుతున్న లెక్కలు వచ్చే నాలుగేళ్ల వరకూ ఉన్నాయని, అవి ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే కేటాయించినట్లు కమిటీ అభిప్రాయపడింది. ఎక్కువే సాయం చేశామంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలు అబద్ధమని తేల్చింది. అయితే ఈ నివేదికను పవన్ కల్యాణ్ రేపు ప్రజల ముందుంచే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో తప్పంతా కేంద్రానిదే అన్నట్లు తేల్చారని తెలుస్తోంది.

‘‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*