తెలంగాణకు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్

ముందు చూపు లేకుండా కుదుర్చుకున్న ఒప్పందాలు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారబోతున్నాయి. విద్యత్తు కొనుగోలు ఒప్పందాలు సర్కార్ కు షాక్ ఇవ్వనున్నాయి. ఒకటి కాదు రెండు కాదే ఏకంగా ఇరవై సంవత్సరాలకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను కుదర్చుకుంది. ఈ మేరకు అవసరమున్నా…లేకున్నా…. వపర్ ధర తగ్గినా సరే ఇరవై ఏళ్లూ ఒప్పందం ప్రకరాం ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. ఇది భవిష్యత్తులో వినియోగదారుల మీదనే భారం పడటం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో పవర్ కట్ లేదు. మండు వేసవిలోనూ నిరంతరాయంగా గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్తును అందిస్తున్నారు. ఆల్ హ్యపీస్. అయితే ఇక్కడే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కుదుర్చుకున్న ఒప్పందాలు ఖజానాను కొంపముంచబోతున్నాయి. అదెలాగంటే బయట మార్కెట్ లో పవర్ ధర తగ్గినా…పాత రేటుకే ఇరవై ఏళ్ల వరకూ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ఖజానాకు భారం కావడంతో పాటు…ప్రజలపై కూడా భవిష్యత్తులో పడనుంది.

ఎక్కువ ధరకు ఒప్పందాలు….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందించాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అయిపోతుందన్న సమైక్యాంధ్ర పాలకుల మాటలను అబద్ధం చేయాలని కేసీఆర్ సర్కార్ పెద్దయెత్తున విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సోలార్, విండ్ పవర్ లను కొనుగోలు ఒప్పందాలను చేసుకుంది. విద్యుత్తు కోసం యూనిట్ కు సుమారు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకూ చెల్లిస్తూ ఒప్పందాలను చేసుకుంది. ఇరవై ఏళ్ల వరకూ ఈ ఒప్పందాలు అమలులో ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్ లో సోలార్ పవర్ ప్రస్తుతం యూనిట్ 2.44 పైసలకే లభిస్తుంది. అయితే పవర్ పర్ఛేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఇరవై ఏళ్ల పాటు ఒప్పందంలో కుదుర్చుకున్న ధరనే చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్తు సరిపడా ఉన్నా విద్యుత్తును ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సర్ ప్లస్ పవర్ ఉండే అవకాశముంది. 2017-18 సంవత్సరంలో రాష్ట్రానికి 54,756 మిలియన్ల యూనిట్లు అవసరమవుతుందని అంచనా. కాని ఒప్పందాల ప్రకారం ఖచ్చితంగా వివిధ సంస్థలు, రాష్ట్రాల నుంచి 66,076 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయాల్సిందే. అంటే రాష్ట్రానికి 11, 320 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సర్ ప్లస్ గా ఉండబోతుందన్న మాట. దీనికి తోడు రాష్ట్రానికి గ్యాస్ ఆధారిత కోటాలో కేంద్రం నుంచి 5,657 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వస్తుంది. ఇది కూడా కలిపితే మొత్తం 16, 977 యూనిట్లు తెలంగాణలో విద్యుత్తు సర్ ప్లస్ గా ఉండబోతుంది. బయట మార్కెట్ లో విద్యుత్ ధర తక్కువగా ఉండటంతో మనకు సర్ ప్లస్ గా ఉన్న విద్యుత్ ను ఎక్కడా విక్రయించే ఛాన్స్ కూడా లేదు.

రద్దు చేసుకునేందుకు వీలులేదా?

పోనీ విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నా ఇరవై ఏళ్ల వరకూ అది సాధ్యపడని విషయం. ఎందుకంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కు 12 రూపాయల చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. మోడీ ప్రభుత్వం కూడా అప్పట్లో 20 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సోలార్ పవర్ ధర తగ్గడంతో ఒప్పందం రద్దు చేసుకుంటామని చెప్పటంతో సరఫరా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు కూడా గుజరాత్ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ ను తప్పుపట్టింది. పీపీఏ ప్రకారం ఇరవై ఏళ్ల పాటు అదే ధరకు కొనుగోలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం కూడా అవసరం ఉన్నా…లేకున్నా… పాత ధరకే మరో పదిహేడేళ్లు విద్యుత్తును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయల నష్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలపై మరింత భారం పడే అవకాశముంది. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సర్కార్ విద్యుత్తు ఛార్జీలు పెంచే యోచనలో లేదు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో గృహ వినియోగదారులు, పరిశ్రమల యాజమాన్యాలకు విద్యుత్ షాక్ ఖచ్చితంగా తగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు ముందుంది మొసళ్ల పండగ అంటున్నారు విద్యుత్తు అధికారులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*