తెలంగాణ, ఏపీల మధ్య కరెంట్ షాక్

విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని తెలంగాణకు ఏపీ విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్తును రెండు రాష్ట్రాలు 46.11 శాతం ఆంధ్రప్రదేశ్), 53.89 శాతం తెలంగాణ దామాషా పద్ధతిలో ఉపయోగించుకుంటున్నాయి. దీని ప్రకారం ఏపీ నుంచి రోజుకు 1,200 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు వెళుతోంది. తెలంగాణ నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు ఏపీకి వస్తోంది. తెలంగాణకు అదనంగా రోజుకు సుమారు 400 మెగావాట్ల విద్యుత్తు ఏపీ జెన్‌కో నుంచి అందుతోంది. ఈ అదనపు విద్యుత్తుకు సంబంధించి తెలంగాణ డిస్కంలు సకాలంలో డబ్బు చెల్లించని కారణంగా బకాయి పడింది. ఏపీ జెన్‌కో విద్యుత్తు తెలంగాణకు ఆపేస్తే ఏపీకి 400 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో ఏపీ జెన్‌కో మాదిరే ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలకు ఇచ్చే విద్యుత్తును తెలంగాణ జెన్‌కో నిలిపివేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు ఏపీకి మరో 400 మెగావాట్ల లోటు ఏర్పడుతుంది. అదే సమయంలో పాత బాకీలు తెలంగా సర్కారు ఎంత మేరకు చెల్లిస్తుందనేది కూడా సందేహమే…..

ఆ బాకీ రానట్లేనా……

నిజానికి ఏపీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పున: సమీక్షించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదముద్ర వేయకముందే ఇతర సంస్థలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటోంది. తెలంగాణ బకాయిలతోపాటు ఆ రాష్ట్రానికి విద్యుత్తును నిలిపివేస్తామని బెంగుళూరులోని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీకి (ఎస్‌ఆర్‌పీసీ) ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలో మళ్లీ దానికి తెలపాల్సిన అవసరం లేకుండానే విద్యుత్తును నిలిపివేసే వీలుంది. బకాయిలను చెల్లించకపోతే మే 31వ తేదీ నుంచి విద్యుత్తును ఆపేస్తామని తెలియజేస్తూ ఏపీ జెన్‌కో ఇప్పటికే తెలంగాణకు నోటీసు జారీ చేసింది. తెలంగాణ డిస్కంలు మొత్తం మీద సుమారు రూ.3,138 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అందులో సింగరేణి కాలరీస్‌కు ఇవ్వాల్సిన మొత్తం కింద రూ.1,360 కోట్లను తెలంగాణ డిస్కంల నుంచి సర్దుబాటు చేస్తామని అధికారికంగా తెలిపినా సింగరేణి అందుకు అంగీకరించడం లేదని ఏపీ జెన్‌కో గతంలో ఇచ్చిన నోటీసులో పేర్కొంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*