దటీజ్…జగన్ అంటున్న….!

వైసీపీ అధినేత జగన్ మీద నేతలకు నమ్మకం పెరిగింది. నిన్న మొన్నటి వరకూ అంటీ ముంటనట్లుగా ఉన్న నేతలు ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకుని తెగ తిరిగేస్తున్నారు. కేవలం మూడు నెలల్లోనే పార్టీలో ఇంత జోష్ తెచ్చారు జగన్. జగన్ మీద నేతలకు నమ్మకం లేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారా? లేదా? అన్నది కూడా వైసీపీలోని చాలామంది సందేహం. కోర్టు కేసులు ఒకవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు మరోవైపు నేతలను అయోమయంలోకి నెట్టేశాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది పార్టీని విడచి వెళ్లడం కూడా ఆ పార్టీ లీడర్లలో నిరాశ నిస్పృహలను పెంచేశాయి.

మూడున్నరేళ్లుగా పట్టించుకోకుండా….

దీంతో మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల్లో పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా తూతూ మంత్రంగా నిర్వహించారు. ఖర్చు పెట్టడం వేస్ట్ అని కొందరు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలూ లేకపోలేదు. దీంతో జగన్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించి కొంత నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత గత ఏడాది నవంబరు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీని వీడి వెళ్లారు. ఎమ్మల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఎంపీ బుట్టా రేణుకలు పార్టీని వదలి వెళ్లారు. దీంతో పాదయాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపదని వైసీపీ నేతలే అభిప్రాయపడిన సందర్భాలున్నాయి.

జగన్ పెద్దగా పట్టించుకోకుండా….

ఈ నేపథ్యంలో పార్టీని నేతలు వీడుతున్నా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తన మానాన తాను నడుచుకుంటూనే వెళ్లారు. అంతేకాదు పాదయాత్రలోనే వ్యూహరచనకు సిద్ధం చేశారు. పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకున్నారు. ప్రత్యేకహోదాను తనకు అనుకూలంగా మలచుకున్నారు. తనకు అనుకూలంగా మలచుకోవడమే కాకుండా అధికార పార్టీని కూడా తన దారిలోకి రప్పించుకున్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని రాష్ట్రంలో పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అవిశ్వాసమంటూ కేంద్రంపై ధ్వజమెత్తి టీడీపీ చేత కూడా అదే మాట అన్పించారు.

వైసీపీ నేతల్లో హుషారు….

దీంతో జగన్ ఒక్కరే ప్రత్యేకహోదా నినాదాన్ని తొలినుంచి అందుకున్నారన్నది ఏపీలో బలంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ అధినేత సూపర్ సక్సెస్ అయ్యారంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా అంటే జగన్ మాత్రమే గుర్తుకొస్తున్నారని ఒక వైసీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇది వాస్తవమని, అందుకు బలమైన కారణం నిజంగా జగన్ ఆ నినాదాన్ని వదిలిపెట్టకపోవడమేనని ఆయన అంటున్నారు. ఇప్పుడు నియోకవర్గాల్లో నేతలు పిచ్చపిచ్చగా తిరిగేస్తూ హోదా కావాల్సిందేనంటూ నినదిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తమదే విజయమంటూ ధీమాగా తిరుగుతున్నారు. మొత్తం మీద జగన్ నాయకత్వం మీద ఇన్నాళ్లకు వైసీపీ నేతల్లో కొందరికి నమ్మకం కలిగిందన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*