దళితులంతా జగన్ సైడే..?

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వై.సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న సామాజిక పునాదిని సంఘటితం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గడచిన వారం రోజులుగా సాగుతున్న పాదయాత్రలో కులపరమైన సమీకరణ ప్రధానాంశంగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే దళితవాడలకు ఉచిత విద్యుత్తు అందచేస్తామన్నది ప్రధానమైన హామీ గా నిలిచింది. పాదయాత్రలో తాను అందరినీ కలవడం సాధ్యంకాదు కాబట్టి స్థానికంగా ఉండే వై.సి.పి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు దళితవాడల్లో పర్యటించి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి రెండు రోజులపాటు అక్కడే నిద్రించాలని జగన్ ఆదేశాలిచ్చారు. దళితవాడల్లోని పెద్దలతో మాట్లాడి ఇందుకుసంబంధించి ఏర్పాట్లు చేసుకొమ్మన్నారు. ఆయా పల్లెల్లో ఎస్సీ,ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తేవాలని సూచించారు. దళిత సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ ను నిర్మించడంతోపాటు పాదయాత్రలో బాగంగా ప్రకటన చేయాలని కూడా జగన్ భావిస్తున్నారు. తద్వారా తొలి నుంచి వై.సి.పికి అండగా నిలుస్తున్న దళిత వర్గాల ఓటు బ్యాంకును సంఘటితం చేసుకొనే దిశలో అగ్రనాయకత్వం ఆలోచన చేస్తోంది.

మొగ్గు కోసం మొక్కవోని ప్రయత్నం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కాలం నుంచి దళిత వర్గాలు కాంగ్రెసు వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందిరాగాంధీ పాలన కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వంటివి ఇందుకు దోహదం చేశాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ ఓటింగులో కొంతమేరకు చీలిక ఏర్పడింది. టీడీపీకి వెనకబడినతరగతుల ఓటింగు ప్రధానంగా వెన్నెముకగా నిలచింది. ఎస్సీ ఓట్లలో కూడా సినీ ప్రియులు , మధ్యతరగతి స్థాయికి చేరిన వారు టీడీపీ వైపు స్వింగ్ అయ్యారు. అయినప్పటికీ మెజార్టీ దళిత ఓటు మాత్రం కాంగ్రెైసు గౌరవాన్ని కాపాడుతూ వచ్చింది. 1982 నుంచి టీడీపీ వైపు మొగ్గు చూపిన మధ్యతరగతి దళిత వర్గాలు సైతం 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్లీ కాంగ్రెసు చెంతకు చేరాయి. ఇందుకు మతం కూడా కొంత ప్రాముఖ్యం వహించింది. రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్టియన్ మతావలంబీకులు కావడంతో ఎస్సీలు, క్రిస్టియన్లు కాంగ్రెసుకు విశ్వసనీయమైన ఓటింగుగా మారారు. కాంగ్రెసు పార్టీ నుంచి వై.ఎస్.కుటుంబం వేరుపడిన తర్వాత దళిత, క్రిస్టియన్లు వై.సి.పికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఓటింగు క్రమం వెల్లడిస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఓటింగుతో పాటు ఎస్సీ సామాజిక వర్గంలోనూ కాంగ్రెసు తన ముద్రను కోల్పోయింది. తాజాగా జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర లో కూడా దళిత వాడల్లో ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని సంఘటితం చేసుకుంటే గరిష్ట ప్రయోజనాలు సమకూరుతాయని వై.సి.పి. అంచనా వేస్తోంది. నియోజకవర్గాల వారీ తమ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు పల్లె నిద్ర,రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి దళితుల కోర్కెలను తెలుసు కోవాలని పార్టీ ఆదేశించింది. ఈ సమాచారం ఆధారంగా జగన్ దళితవాడల్లో పర్యటించిన సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే ఆయా సమస్యలపై వైఖరిని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తున్నారు.

‘దేశం’ భయంతోనే..

వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే తన పార్టీలో కలిపేసుకున్న తెలుగుదేశం పార్టీ జగన్ మోహన్ పర్యటన ముగిసే ఏప్రిల్ నెలనాటికి కనీసం మరో పదిమందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే జరిగితే పార్టీ శాసనసభాపక్షం సగం ఖాళీ అయిపోయినట్లే. వై.సి.పి. నుంచి కొత్తగా టీడీపీలోకి వచ్చేవారికి మంత్రి పదవుల వంటివి ఇచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే వై.సి.పి.కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళిత వర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటూ తన వ్యూహం రచించుకుంటోంది. గడచిన ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు హామీ, ఎన్నికల వ్యయం భరించడం వంటి ఆర్థిక పరిపుష్టికి తెలుగుదేశం పార్టీ ఆయా ఎమ్మెల్యేలకు పూచీకత్తు నిస్తోంది. ఈమేరకు టీడీపీ మంత్రులు, వై.సి.పి. మాజీ సహచరులు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. బడ్జెట్ సెషన్ లోపు మొత్తం కసరత్తు ఒక కొలిక్కి రావచ్చని కూడా రాజకీయ అంచనా. అందుకే దళిత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఆ వర్గంలో వై.సి.పి.కి ఉన్న పట్టును నిరూపించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. దళిత సామాజిక వర్గానికి భారీగా స్కీములు ప్రకటించడం ద్వారా జగన్ కు ఆయావాడల్లో నీరాజనాలు పట్టేలా చూసుకుంటున్నారు. ఇది కచ్చితంగా పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలను పునరాలోచనలో పడేస్తుందని వై.సి.పి.ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రజామద్దతుతో పార్టీ ఫిరాయింపులను తిప్పికొట్టాలనుకుంటున్న జగన్ ప్లాన్ ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1