ధూళిపాళ్లకు స్థాన చ‌ల‌నం ఖాయం? మార్పు త‌ప్పదా?

అవును! ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో ఈ చ‌ర్చే న‌డుస్తోంది. అత్యంత సీనియ‌ర్ అయిన టీడీపీ నేత‌ల్లో ధూళిపాళ్ల న‌రేంద్ర ఒక‌రు. ఆయ‌న పార్టీలో కీల‌క వ్యక్తిగానే కాకుండా వివాద ర‌హితుడిగా, అధినాయ‌కత్వం ప‌ట్ల విధేయునిగా కూడా పేరు తెచ్చాకున్నారు. ప్రస్తుతం ఈయ‌న గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వ్యక్తి. అయితే మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో పాటు కొన్ని విష‌యాల్లో న‌రేంద్రను చంద్రబాబు ప‌క్కన పెట్టడంతో న‌రేంద్ర ఇటీవ‌ల మీడియా ముందుకు కూడా పెద్దగా రావ‌డం లేదు. అయితే, ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే.. ప్రస్తుతమున్న ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కొన్ని మండ‌లాల‌ను త‌ప్పించి.. వేరేవాటికి క‌ల‌ప‌డం ద్వారా రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాల భ‌విత‌వ్యం మారిపోతుంది.

పొన్నూరు ఎస్సీ రిజర్వ్ డ్ అయితే….

ఇక‌, ఇదే స‌మ‌యంలో కొన్ని జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొన్ని మండ‌లాల‌ను చేర్చడం ద్వారా వాటిని రిజ‌ర్వ్ చేయాల‌ని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అధికారం కేంద్ర ఎన్నిక‌ల సంఘానిదే అయినా మండ‌లాల మార్పులు, చేర్పులు అధికారం మాత్రం ఎక్కువుగా స్థానిక ప్రభుత్వాలు, క‌లెక్టర్లు చెప్పిన‌ట్టే జ‌రుగుతుంటాయి. ఇక గుంటూరు జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ్ కేట‌గిరిలోకి వెళ్లనుంది. ఇదే జ‌రిగితే.. పొన్నూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ధూళిపాళ్లకు స్థాన చ‌ల‌నం త‌ప్పద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు మున్సిపాల్టీతో పాటు, పొన్నూరు రూరల్‌, చేబ్రోలు,పెదకాకాని మండలాలు ఉన్నాయి. పెదకాకాని మండలం గుంటూరుకు కేవలం ఐదు కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో ఆ మండలాన్ని పొన్నూరు నుండి వేరు చేయడం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరి ఎక్కడి నుంచి?

అదే విధంగా చేబ్రోలు మండలం కానీ.. కాకుమాను మండలాల్లో ద‌ళిత ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గాన్ని 2009 ముందుకు రిజర్వ్‌డ్‌ చేశారు. ఆ నియోజకవర్గం యధావిధిగా ఉంటుందా..? ఒకప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు మండలం మళ్లీ కలుపుతారా..? అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో కాకుమాను మండలాన్ని కలిపితే అప్పుడు జిల్లా మొత్తం మీద దళిత ఓటర్లు ఉన్న నియోజకవర్గం పొన్నూరు అవుతుంది. దీంతో ఇది రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గంగానే మారుతుంది. ఫ‌లితంగా ఇక్కడి నుంచి గ‌త ఐదు సార్లుగా అసెంబ్లీకి గెలుస్తూ వ‌చ్చిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల.. ప‌రిస్థితి ఏమిటి? అనేది చ‌ర్చకు దారితీస్తున్న విష‌యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఇక్కడి నుంచి గెలిచి ఈ ద‌ఫా అధినేత‌ను మంచి చేసుకుని మంత్రి వ‌ర్గంలో సీటు సాధించాల‌ని చూస్తున్న ధూళిపాళ్లకు ఈ ప‌రిణామం ఇబ్బంది క‌లిగించేదిగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో ? నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి పొన్నూరు ఎస్సీగా మారితే న‌రేంద్ర ఎక్కడి నుంచి పోటీకి దిగుతారో? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*