
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. లోకల్ సమస్యలతో పాటు స్థానిక నేతల అవినీతిని కూడా ఎండగడుతున్నారు. ఇసుక మాఫియా తీరును తన గుంటూరు యాత్రలో వివరించారు. గుడి భూములను కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదన్నారు. చివరకు మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందేనంటూ చెలరేగిపోయారు. అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు ఎన్నాళ్లు పాలన కొనసాగిస్తారని జగన్ ప్రశ్నించారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకూ అవినీతికి పాల్పడుతున్నా చంద్రబాబు ప్రజలు తన పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు.
హోదా విషయంలో…..
ఇక ప్రత్యేకహోదా విషయంలో కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. తాను ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రాణ సమానమని చెబుతుంటే తనను అసెంబ్లీలో హేళన చేసిన మాట వాస్తవం కాదా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని తనను ఎదురు ప్రశ్నించలేదా? అని నిలదీశారు. హోదాతో ప్రయోజనం లేదన్న చంద్రబాబు చివరకు ప్రజల వత్తిడికి తలొగ్గక తప్పలేదన్నారు. హోదా కోసం పార్టీల కతీతంగా 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే జాతీయ అంశంగా మారుతుందని చెప్పినా చంద్రబాబు విన్పించుకోవడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు.
కధలతో అలరిస్తూ….
జగన్ తన ప్రసంగంలో అనేక మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. కొన్ని కథలు చెబుతూ ఆకట్టుకుంటున్నారు. జగన్ గుంటూరు పట్టణంలో చెప్పిన కథ విశేషంగా అలరించింది. ‘‘ఒక దొంగ చనిపోయి నరకలోనికి వెళ్లాడు. తనను ఎందుకు నరకానికి తీసుకొచ్చారని యమధర్మరాజును దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేశావు. అది పాపం అందుకే నరకానికి వచ్చావు’’. అని యమధర్మరాజు చెప్పారు. దీనికి దొంగ ‘‘నేను దొంగతనం చేసినట్లు ఆధారలేమైనా మీ వద్ద ఉన్నాయా?’’ అని అడిగాడు. దీనికి యమధర్మరాజు సీసీ టీవీ ఫుటేజీలు చూపారు. అయితే దీని సంగతేంటి సామీ అని దొంగ యమధర్మరాజును అడిగాడు. ఏంటది అని యమధర్మరాజు అడగ్గా….‘‘ఓటు కు నోటు కేసు’’ ఫుటేజీ చూపాడు దొంగ. ఇదేంటి? అని యమధర్మరాజు అడిగితే తాను యాభై వేలు మాత్రమే దొంగతనం చేశానని, అక్కడ మా ముఖ్యమంత్రి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అడ్డంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు సామీ’’ అని మరి ఆయను ఏం శిక్ష విధిస్తారు? అని ఎదురుప్రశ్నించాడు దొంగ. దీంతో యమధర్మరాజుకునోట మాటరాలేదట. మళ్లీ తేరుకుని యమధర్మరాజు ‘‘ మరీ నువ్వు చేసిన మోసం చేసిన సంగతేంటి? మీ పక్కింటి వాళ్ల దగ్గర పదివేలు అప్పు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయావు కదా? అని ప్రశ్నించారు యమధర్మరాజు. దీనికి దొంగ ‘‘అయితే దీని సంగతేంటి సామీ’’ అని టీడీపీ మ్యానిఫేస్టో యమధర్మరాజు చేతిలో పెట్టారట. అలా ఆ దొంగ చంద్రబాబు పేరు చెప్పుకుని యమలోకంలో శిక్షలు తప్పించుకున్నాడని జగన్ చెప్పిన కథ నవ్వులు పూయించింది.
ప్రజల బాగోగులు పట్టవా?
ఇక గుంటూరులో డయేరియా మరణాలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అవినీతి చేయడంలో ఉన్నశ్రద్ధ పాలనపై లేదన్నారు. రాజధానికి కూతవేటు దూరంలో తాగేనీరు కలుషితమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పదుల సంఖ్యలో మరణిస్తే గాని ప్రభుత్వం మేల్కోలేదన్నారు. ఇదీ చంద్రబాబుకు ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ అని ఎద్దేవా చేశారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ల వెలుతుర్లో సర్జరీలు చేసే దుస్థితి నెలకొందని ఇదే సింగపూర్ తరహా అభివృద్ధి అని ఆయన సెటైర్ వేశారు. మొత్తం మీద గుంటూరు పట్టణంలో జగన్ పర్యటన ఆసాంతం ఉత్సాహ భరితంగా సాగింది.
Leave a Reply