
నాకోసం కాదు…నాకుటుంబం కోసం…కాదు ప్రజల కోసమే నా పోరాటం అంటూ ఒకాయన….రాష్ట్రంలో అవినీతి, అబద్ధాల రాజ్యమేలుతోంది….దానిని కూకటి వేళ్లతో పెకలిస్తానంటూ మరొకాయన…ఏపీ రాజకీయాల్లో పెద్ద డ్రామాకు తెరలేపారు. నాటకాల రాయుళ్లు నంగి మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ తమ కోసం కాదని ప్రజల కోసమేనంటూ అసత్యాల మూటలు కట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు. నవరసాలనూ పండిస్తున్నారు. ఏపీ రాజకీయాలు ఫక్తు నాటకీయతను ఇద్దరూ ప్రదర్శిస్తుండం రాజకీయవర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా పెద్ద సమయం లేక పోవడంతో సీన్లు మీద సీన్లు పండించేస్తున్నారు.
సీఎం కావాలన్నదే…..
ఇద్దరిదీ ఒకటే లక్ష్యం. అధికారంలోకి రావడమే. ముఖ్యమంత్రి పదవిని మళ్లీ అధిష్టించాలని చంద్రబాబు, ఎలాగైనా సీఎం సీటును కొట్టేయాలని జగన్ ఎవరికి వారే వ్యూహాలు రచించుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో అబద్ధాల స్పీడ్ ను మరింత పెంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లు కమలం పార్టీతో కలిసి తిరిగి ఎన్నికలు వచ్చే సమయానికి తూచ్ అంటూ బయటకు వచ్చేశారు. తప్పంతా కేంద్రానిదేనని చెప్పేశారు. ప్రధాని మోడీ అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. నాలుగేళ్లవుతున్నా రాజధాని డిజైన్లను ఇప్పటికి ఖారారు చేశారు. పోలవరం పరిస్థితి అంతే.
కుటుంబం కాదట…ప్రజలేనట….
గత నాలుగురోజులుగా అసెంబ్లీలో చంద్రబాబు తనకు సంపాదన అవసరం లేదని, వ్యాపారాలన్నీ కుటుంబ సభ్యులే చూసుకుంటారని, నీతి, నిజాయితీలతో కూడిన విలువైన జీవితం తనదని, తన జీవితం తెరచిన పుస్తకమంటూ డైలాగ్ ల మీద డైలాగ్ లు కొట్టేస్తున్నారు. తనకు కుటుంబం ముఖ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ లో పేదరికం తొలగించడమే తన లక్ష్యమంటూ చెప్పుకుంటూ వెళుతున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తన అంతిమ లక్ష్యమంటూ పేర్కొంటున్నారు. పోలవరానికి అడ్డం పడితే ఊరుకోనని హెచ్చిరిస్తున్నారు. అంటే పోలవరం, రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మరోసారి తనకు అవకాశమివ్వాలని చంద్రబాబు ప్రజలను ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.
అవినీతిని రూపుమాపుతారట….
ఇక విపక్ష నేత వైఎస్ జగన్ హామీలకు అంతు లేకుండా పోతోంది. కన్పించిన వాళ్లకు ఎమ్మెల్సీ సీటు, కన్పించని వాళ్లకు కార్పొరేషన్ పదవి అంటూ ఊదరగొట్టేస్తున్నారు. అవినీతితో భ్రష్టుపట్టిపోయిన సమాజాన్ని ఉద్ధరించడానికే తాను వచ్చానంటూ పాదయాత్రలోవివిధ పథకాలను ప్రకటిస్తున్నారు. నవరత్నాల పేరుతో వరాల జల్లులు కురిపిస్తున్నారు. తనకు ప్రత్యేక హోదా సాధన ముఖ్యమని, హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు జగన్ ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు చూస్తే ఉన్న బడ్జెట్ చాలదు కదా? మరో లక్ష కోట్లు అప్పు తేవాల్సిందేనంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలా ఇద్దరు నేతలూ ఏపీలో అధికారం చేజిక్కించుకోవడానికి అబద్ధాలను అందంగా వర్ణిస్తూ చెప్పుకుపోతున్నారు. మరి ఎవరి అబద్ధాలను ప్రజలను నమ్ముతారో…? ఎవరిని విజేతలను చేస్తారో తెలియదు కాని… వీరిద్దరి మాటల్లో మాత్రం నిజం లేదని స్పష్టంగా ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంది. చూడాలి మరి. ఏం జరుగుతుందో.
Leave a Reply