నాడు ఒప్పయింది….నేడు తప్పెలాఅవుతుంది చంద్రబాబూ?

రాష్ట్ర విభజన తర్వాత జలజగడాలు జటిలమవుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసుకోవడంపై పొరుగు రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చాలా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. తనను నీళ్ల దొంగ అంటారా అని మండిపడ్డారు…..నిజమే గుక్కెడు నీళ్ల కోసం జనాలు అల్లాడుతుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా తమ ప్రజల బాగోగులు ముఖ్యం…. ఆ స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి కోపం రావడంలో అర్ధముంది. కాని ఒక్కసారి పదేళ్ల వెనక్కి వెళ్దాం.వైఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే జలయజ్ఞంలో భాగంగా పోతిరెడ్డి పాడు నిర్మాణాన్ని చేపట్టిన వెంటనే ఆంధ్రాలో ఆందోళనలు మొదలయ్యాయి. వాటికి నేతృత్వం వహించింది ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావే. దాదాపు ఆరేడేళ్ల పాటు రెండు మూడు రోజులకోసారి పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా ఉమా గళం విప్పేవారు. కృష్ణాడెల్టాకు నీటి వినియోగంలో మొదటి హక్కు ఉందనే నినాదంతో రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేవి. విజయవాడ నుంచి., హైదరాబాద్‌ నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు అక్రమంగా తరలించేసుకుంటున్నారని., ఇడుపుల పాయ కోసమే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసేవారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం ఏనాడు వీటిని ఖండించ లేదు. పైగా సాగునీటి ప్రాజెక్టులపై దేవినేని ఉమా పోరాటాలకు బాబు నుంచి మద్దతు లభించేది. చివరకు 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం కృష్ణాడెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఇదే ప్రచారాస్త్రం అయ్యింది. ఓ వైపు రాష్ట్రం విడిపోయింది., మరోవైపు తెలంగాణతో జల జగడాలు తప్పవు., వైసీపీకి ఓట్లేస్తే నీళ్లన్ని ఇడుపులపాయకే వెళ్లిపోతాయని ఉమా చెప్పేవారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎవరైనా కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటిని నిలిపేస్తారా అని ప్రశ్నిస్తే తాము అక్రమ నీటి వినియోగాన్ని అడ్డుకుంటామని చెప్పేవారు. పోతిరెడ్డి పాడుకు నికర జలాల్లో కేటాయింపులు లేవని., అవన్ని అక్రమంగా వాడుకుంటున్నావని డెల్టా రైతాంగంలో ఆందోళన కలిగించడంతో సక్సెస్‌ అయ్యారు.

ఎవరిది తప్పు…..

రాష్ట్ర విభజన తర్వత తొలిసారి రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరతను ఈ ఏడాది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎగువ ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండే వరకు నీళ్లు వదలకపోవడంతో తెలంగాణ., రాయలసీమలు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో హైదరాబాద్‌, నల్లగొండ జిల్లాలకు తాగునీరు కూడా కష్టమైంది. ఇటు రాయలసీమలో కూడా అదను దాటిపోతుండటంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సెప్టెంబర్‌లో నీరు అందకపోతే పంటల్ని పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి. సెప్టెంబర్‌ మొదటి వారంలో కృష్ణా వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరిన వెంటనే తెలంగాణ సర్కార్‌ కోయిల్‌సాగర్, బీమా, నెట్టెంపాడు ఎత్తపోతల, జూరాల ప్రాజెక్టు కాలువల ద్వారా నీటిని మళ్లించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరాక పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని విడుదల చేయడంతో తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పోతిరెడ్డి పాడుకు నీటిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఏది నిజం……సీమకు నీళ్లు అక్కర్లేదా….

నిజానికి ఆంధ్రా., తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా బేసిన్‌లో వాడుకుంటున్న జలాల్లో అధిక భాగం కర్ణాటకలో కురిసిన వర్షాల ద్వారా దిగువకు వచ్చేవే. గతంలో పరిమితంగా సాగునీటి ప్రాజెక్టులు ఉండటంతో నీటి పంపకంతో ఇబ్బందులు రాలేదు. అయితే ఇప్పుడు కృష్ణా జలాల పంపిణీ సంక్లిష్టంగా మారింది. కృష్ణా డెల్టాను గోదావరి జలాల మళ్లింపుతో కాపాడినా రాయలసీమ., తెలంగాణకు పూర్తి స్థాయి రక్షణ లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల నుంచి గత రెండు మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు నీటిని వాడేసుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జలాశయం కనీస నీటిమట్టం 854 అడుగులుగా నిర్ణయించారు. ఈ మేరకుకనీస మట్టం మేరకు జలాశయంలో నీరు నిల్వ ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ 1996లో అప్పటి సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 నుంచి 2003 వరకూ ఏ ఒక్క ఏడాది కూడా 834 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయలేదు. డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేయడం వెనుక కోస్తా జిల్లాల ఒత్తిడి బలంగా పనిచేసేది. 790 అడుగుల దిగువ వరకు కూడా నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు తిరిగి పునరుద్ధరించారు.శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరిన తర్వాత కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయవచ్చు. గత మూడేళ్లుగా 854 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ వచ్చారు. ఈ ఏడాదీ శ్రీశైలం జలాశయంలో 848 అడుగుల నీటి మట్టం వద్దే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు.

అందరికి నీళ్లు అవసరమే…..

నిజానికి నీటి వినియోగం విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో తుది అవార్డు వెలువడాల్సి ఉంది. అదే సమయంలో నీటి సమస్యను రాజకీయ లబ్ది కోసం అధికారంలో ఉన్నపుడు ఒకలా., ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోలా వాడుకోవడమే అసలు సమస్య….. ఆ విషయాన్ని చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు కూడా మరచిపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాలు., ప్రాంతీయ ప్రయోజనాల విషయంలో ఎవరి అవసరాలు వారికి ఉండొచ్చు. తెలుగు పత్రికలు కూడా ఇందుకు భిన్నంగా ఏమి లేవు. రెండు ఎడిషన్లుగా పత్రికలు మారిపోవడంతో ఏ రాష్ట్రానికి అనుగుణంగా అక్కడి వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఉన్నత హోదాలో ఉన్న వారు విమర్శలు చేసే ముందు గతంల తాము అన్న మాటలు కూడా జనానికి గుర్తుంటాయని గుర్తించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*