నారాయ‌ణ‌కు…. ఆ మంత్రికి ప‌డ‌ట్లేదా.. రీజ‌న్ ఇదే

రాజ‌కీయాలన్నాక ఎప్పుడు ఎవ‌రు అంద‌లం ఎక్కుతారో? ఎప్పుడు ఎవ‌రు రోడ్డున ప‌డ‌తారో? చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట‌.. సంక్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరి.. ఎమ్మెల్సీగా ఎన్నికై.. మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. అంత‌టితో ఆగ‌కుండా నెల్లూరు జిల్లాలో చ‌క్రం తిప్ప‌డం ప్రారంభించారు. నిజానికి నెల్లూరు జిల్లాలో టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్న నేత‌లు సైతం నారాయ‌ణ అరంగేట్రంతో మౌనం వ‌హించేశారు. అప్ప‌టికే రాజ‌కీయాల్లో త‌న‌కుంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సైతం నారాయ‌ణ దూకుడుకు ప‌క్క‌కు జ‌ర‌గాల్సి వ‌చ్చింది.

వరుస ఓటములతో సోమిరెడ్డి….

సోమిరెడ్డి 2004-2009-2012-2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయారు. దీంతో చ‌ట్ట‌స‌భ‌ల్లో లేక‌పోవ‌డంతో పాటు ప్ర‌జ‌ల మ‌న‌స్సును గెలుచుకున్న నేత కాక‌పోవడంతో స‌హ‌జంగానే సోమిరెడ్డికి జిల్లాలో క్రేజ్ త‌గ్గింది. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మూడుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచిన‌ప్పుడు కూడా ఓడిపోవ‌డంతో రాజ‌కీయ చ‌ద‌రంగంలో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. దీంతో ఇదే టైంలో నారాయ‌ణ నేరుగా రాజ‌కీయాల్లోకి రావ‌డం, ఎమ్మెల్సీ, మంత్రి ఇలా దూసుకుపోతూ స్టేట్ కేబినెట్‌లోనే కీల‌కంగా మారారు. మూడేళ్ల‌పాటు జిల్లాలో మంత్రి నారాయ‌ణ‌ది ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా ఉంది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. సోమిరెడ్డి కూడా మంత్రి అయ్యారు. దీంతో ఆయ‌న త‌న‌హ‌వా స్టార్ట్ చేశారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మంత్రి నారాయణ చేతుల నుండి సోమిరెడ్డి అధీనంలోకి వచ్చింది. మున్సిపల్‌శాఖ అధికారులు మినహా మిగతా జిల్లా యంత్రాంగం మొత్తం మంత్రి సోమిరెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కార‌ణాల రీత్యా మంత్రి నారాయణను దూరంపెట్టారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి తనకు అనుకూలంగా జిల్లా ప‌రిస్థితిని మలచుకుని అధికార యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో పెట్టుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

నారాయణ చేసిన తప్పులను….

నిజానికి నారాయ‌ణ మంత్రి అయ్యాక‌.. నెల్లూరులో అప్ప‌టికే ఉన్న రెడ్డి హ‌వాకు కాపులు అడ్డుత‌గిలారు. నారాయ‌ణ కాపు వ‌ర్గానికి చెంద‌ని నేత కావ‌డంతో ఆయ‌న ఆధిక్య‌తే ఎక్కువ‌గా సాగింది. అయితే, రాజ‌ధాని నిర్మాణం, క‌ళాశాల‌ల్లో విద్యార్థుల మ‌ర‌ణాలు వంటికీల‌క విష‌యాల్లో నారాయ‌ణ ఫెయిల్ అయ్యారు. దీంతో సోమిరెడ్డి గతంలో నారాయణ చేసిన తప్పులను సరిచేస్తున్నారు. సోమిరెడ్డికి కలసివచ్చే విధంగా జిల్లాలో రాజ‌కీయాల‌ను మార్చుకుంటున్నారు. ఈయ‌న‌కు ఆగ‌స్టులో జ‌రిగిన‌ నంద్యాల ఉపఎన్నిక బాగా కలసి వచ్చింది. ఆ ఎన్నిక‌లో బాబు సోమిరెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనిని ఆయ‌న ఛాలెంజ్‌గా తీసుకుని న‌డిపించారు. ఈ నేపథ్యంలో నెల్లూరుపై ప‌ట్టు పెంచుకునేందుకు సోమిరెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు చంద్ర‌బాబు కూడా మౌనంగా చూస్తూ ఉన్నారు. దీంతో మంత్రి నారాయణ అధికారం క్రమక్రమంగా కనుమరుగు అవుతోంద‌ని తెలుస్తోంది. ఇక సోమిరెడ్డి గతంలో మంత్రిగా ప‌నిచేయ‌డంతో పాటు జిల్లా అంత‌టా సంబంధాలు క‌లిగి ఉండ‌డంతో ఇప్పుడు ఆ పాత నాయ‌కులంద‌రిని క‌లుపుకు పోతూ పూర్తిగా జిల్లాపై గ్రిప్ సాధించేశారు. ఇక నారాయ‌ణ కూడా ప‌ట్టు వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క ఫైట్ చేస్తున్నాడు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారాయ‌ణ కూడా నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి, నెల్లూరులో రాజ‌కీయాల‌ను శాసించే విష‌యంలోను తీవ్ర అంత‌ర్గ‌త యుద్ధం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*