నారా వారికి నానా కష్టాలు…!

బిజెపి విసిరిన ఉచ్చులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిక్కుకు పోయారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలిసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే జాతీయ ప్రాజెక్ట్ లు నత్తనడకన ఏళ్లతరబడి సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో శరవేగంగా పనులు చేసి పోలవరాన్ని 2018 మార్చి నాటికి పూర్తి చేస్తామంటూ హామీనిచ్చి నీతి ఆయోగ్ ను చంద్రబాబు ఒప్పించారు. టిడిపి మిత్రపక్షం కావడం ఎన్డీయేలో కీలక భాగస్వామి అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత ఆయనకే అప్పగించారని అంతా అప్పట్లో భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుని చంద్రబాబు నెత్తిన పెట్టి చోద్యం చూడటం మొదలు పెట్టింది. బాబు బిజెపి అనుకున్నట్లే తప్పటడుగులు వేయడం రెండు ఎత్తిపోతల పధకాలను ముందు ప్రారంభించడం మూడేళ్లు ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేయడం చేసిన పనులకు బిల్లులు సక్రమంగా అందజేయకపోవడం వంటి తప్పులతో పాటు కాంట్రాక్టర్ వల్లే ప్రాజెక్ట్ ఆలస్యం అంటూ నెపం ట్రాన్స్ స్ట్రాయి పై తోసెయ్యడంతో ప్రాజెక్ట్ ను తిరిగి కేంద్రం తన చేతుల్లోకి తెచ్చుకునే పరిస్థితి బిజెపి అనుకున్నట్లే ఏర్పడింది.

ముందు నుయ్యి వెనుక గొయ్యి ….

పోలవరం పై ఇప్పుడు చంద్రబాబుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి ని మోడీ సర్కార్ కల్పించింది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ చంద్రబాబు బిజెపి మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ లతో సమావేశం పెట్టి వారే కేంద్రం మీద వత్తిడి తెచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరించాలని ప్రాధేయపడ్డారు. కేంద్రానికి రాష్ట్రానికి నడుమ పోలవరం ప్రాజెక్ట్ అంశంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన కాగితాలు తెచ్చి చూపి మరి ఇలా అయితే ఎలా అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అయినా ప్యాకేజి సైతం రాజీపడి అంగీకరించామని, కనీసం పోలవరం ప్రాజెక్ట్ కైనా కేంద్రం సహకరిస్తుందని భావిస్తే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా వెళ్ళి కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. విభజన తరువాత లోటు 17 వేలకోట్ల రూపాయలు భర్తీ కావలిసివుండగా 7 వేలకోట్ల రూపాయలే ఇస్తామని చెప్పారని దానికి మిత్రపక్షంగా ఉన్నందుకు అంగీకరిస్తే, 4500 కోట్ల రూపాయలు ఇచ్చి మిగిలిన సొమ్ముకు ఇప్పటికి సమాధానం చెప్పడం లేదని బిజెపి నేతల ముందు వాపోయారు చంద్రబాబు. గత రెండేళ్ళుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆపాయిట్మెంట్ ఏపీ సీఎం కి దక్కకపోవడంతో ఎవరికి తన బాధ చెప్పుకోవాలో తెలియని చంద్రబాబు రాష్ట్ర బిజెపి నేతలపైనే పోలవరం బాధ్యత పెట్టడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*