నితీష్ కు అధినేతతో సంబంధాలు చెడాయా?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణ గాంధీకే జేడీయూ మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీతో కలిసి బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో జేడీయూ వైఖరిలో మార్పు ఉండదని జేడీయూ ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందే నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని ప్రకటించారని దానిలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్ధి వెంకయ్యనాయుడు గెలుపు ఖాయమైన నేపథ్యంలో జేడీయూ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవు. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికలో జేడీయూ ఎమ్మెల్యే స్వతంత్రంగా వ్యవహరించవచ్చని ఆ పార్టీ స్పష్టం చేసింది. మరో వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమ మద్దతు గోపాలకృష్ణ గాంధీకేనని ప్రకటించారు. తాము మద్దతివ్వడం వల్ల ఎన్డీఏ అభ్యర్థికి వచ్చే నష్టమేమీ ఉండబోదని కూడా నితీష్ స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ విపక్షాల అభ్యర్థికే మద్దతిస్తుందని నితీష్ ప్రకటించడం విశేషం.

గాంధీకే మద్దతివ్వాలని…….

జేడీయూ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్ కు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లే కన్పిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన శరద్ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ఇంతవరకూ మాట్లాడనే లేదు. పైగా ఎంపీల సమావేశంలో తమ మద్దతు విపక్షాలకేనని ప్రకటించడం నితీష్ కు ఇబ్బందిగా మారిందనే చెప్పొచ్చు. జేడీయూ ఎంపీలను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలన్న యోచనలో బీజేపీ ఉంది. అయితే శరద్ యాదవ్ ఇందుకు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. దీంతో జేడీయూ చీలిపోనుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీహార్ జేడీయూ ఎమ్మెల్యేలు మాత్రం నితీష్ తోనే ఉండటం గమనార్హం. పార్లమెంటు సభ్యుల విషయంలోనే తేడా వచ్చింది. మరి ఈ సమస్య నుంచి జేడీయూ ఎలా బయటపడుతుందో చూడాలి. అయితే శరద్ యాదవ్ ఈరోజు స్పందించారు. మహాకూటమికి బీటలు ఏర్పడటం బాధాకరమని ఆయన అన్నారు. బీహార్ లో రాజకీయ పరిణామాలు దురదృష్టకరమన్నారు. ప్రజలు కోరుకున్న మహాకూటమిని వీడి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*