నీక్కావలసింది..నా దగ్గర ఉంది

కేంద్రంపై కస్సుబుస్సులాడుతున్న చంద్రబాబు స్పీడుకు బ్రేకులు వేసేందుకు మోడీ, అమిత్ షాలు మంచి పన్నాగమే పన్నారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు వెళ్లేందుకు రాజకీయ పెట్టుబడి కావాలి. ఏదో చేశామని ప్రజలకు చూపించి ఓట్లడగాలి. కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు విపక్షంలోని వై.ఎస్. జగన్ ప్రజల్లో పాదయాత్ర చేస్తూ ప్రతినిముషమూ బాబును టార్గెట్ చేస్తున్నారు. జగన్ చేస్తున్న విమర్శలతో సరిపోయే ఫీల్డు లెవెల్ వాస్తవాలు మరింత భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ద్వారా కొంత నష్ట నివారణ చేసుకోవచ్చనే యోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా యువత తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉన్నట్లుగా రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ భారీ ఎత్తున సాగుతోందన్న భావన కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమనేది టీడీపీ అంచనా. దీంతో మొత్తం నెపాన్ని బీజేపీపై తోసివేసి సేఫ్ గేమ్ ఆడాలనేది పార్టీలో ఉన్నతస్థాయిలోనే తీసుకున్న నిర్ణయం . అందుకు తగిన సమయం , సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. బాబు దూరమైతే ఆ ప్రభావం జాతీయంగా కూడా కొంత సంచలనమయ్యే అవకాశం ఉండటంతో ఉన్నంతలో ఏం చేయాలనే దిశలో బీజేపీ అగ్రనాయకులు దిద్దుబాటు యత్నాలు చేపట్టారు.

కార్పొరేట్ పాలిటిక్స్ …

కార్పొరేట్, రాజకీయ రంగాల మధ్య సంబంధాలు కొత్తేం కాదు. దీనికి కూడా తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడినే ఆద్యుడిగా చెప్పుకోవాలి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలను రాజకీయాల్లోకి తెచ్చి వారికి ఉన్నతపదవులు ఇవ్వడాన్ని ఆయన ఒక రాజకీయ క్రీడగా మార్చారు. వైస్రాయి ప్రభాకరరెడ్డి మొదలు సీఎం రమేశ్, నేటి కేంద్రమంత్రి సుజనాచౌదరి వరకూ ఇలా ఎదిగినవారే. వివిధ అవసరాల నిమిత్తం వారిని పెట్టుబడి ముడిసరుకుగా వినియోగించుకున్న తర్వాత ప్రతిఫలంగా పదవులు ఇవ్వడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. జాతీయ , అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు కు మంచి సంబంధాలే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సదస్సుల్లొ పాల్గొనడంతోపాటు వారితో నిత్యం టచ్ లో ఉంటుంటారు. అనేక సందర్భాల్లో ఇది రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చిన విషయం కూడా వాస్తవమే. తాజాగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ముఖేష్ అంబానీ ఇటీవల అమరావతికి వచ్చి రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రితో ఒక పూట మొత్తం మంతనాలు జరిపారు. ఇదేం సాధారణ వ్యవహారం కాదు. ముఖేష్ అంబానీ పెట్టుబడులు పెడతానంటే ముఖ్యమంత్రులే ముంబైకి క్యూ కడతారు. కానీ పని కట్టుకుని అమరావతి రావడం వెనక బీజేపీ వ్యూహం దాగి ఉందనేది రాజకీయ వర్గాల జోస్యం. విశాఖ పెట్టుబడుల సదస్సులో కూడా మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీ పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ ను ఆకాశానికెత్తేయడం కూడా వ్యూహమే. రిలయన్స్, అదానీ గ్రూపులకు పారిశ్రామిక వర్గాల్లో మంచి పేరే ఉంది. ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తాయనే పాజిటివ్ సిగ్నల్ పంపగలిగితే చంద్రబాబు కు కొంచెం వెసులుబాటు లభిస్తుందనే భావనలో ఉంది బీజేపీ.

దౌత్యానికి దారులు…

రాజకీయ దౌత్యానికి పూర్తిగా దారులు మూసుకు పోకుండా కార్పొరేట్ రూట్ ను ఇందుకు ఒక సాధనంగా వినియోగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ముఖేష్ అంబానీ వంటి వారిచ్చే సలహాను చంద్రబాబు పాటిస్తారు. అదే సమయంలో అంబానీ మాటంటే ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు కూడా పెద్దగురి. ముఖేష్ జోక్యం చేసుకుని తెరవెనక మంతనాలు మొదలుపెడితే బాబు మెత్తబడటం ఖాయమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖేష్ ఇంతవరకూ రాజకీయపార్టీల వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చిన ఉదంతాలు లేవు. పరోక్షంగా ఆయన ప్రభావితం చేసిన సంఘటనలూ పెద్దగా బయటికి రాలేదు. ఇప్పుడు ఏపీ విషయంలో బీజేపీ, టీడీపీ సంబంధాలు మళ్లీ సజావుగా గాడిన పడితే అందులో రిలయన్స్ గ్రూపు పాత్రను కూడా తక్కువగా చూడలేం. ఎందుకంటే ఇక్కడ ఉన్నకోస్తాప్రాంతంలో రిలయన్స్ గ్రూపునకు వ్యాపారాసక్తులు చాలా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల లాభాల సిరులు పండించే ముడిచమురు, గ్యాస్ వెలికితీత కార్యకలాపాల్లో రిలయన్స్ నిమగ్నమై ఉంది. షాపింగుమాల్స్, రిటైల్ వ్యాపారాలు, సెల్ కంపెనీలు ఇలా ..అనేక విధాలుగా ఏపీతో అనుబంధం బలపడుతూ వస్తోంది. రాజకీయ స్థిరత్వంతోపాటు నమ్మకమైన మిత్రుడు ముఖ్యమంత్రిగా ఉండటం కూడా అంబానీలకు అవసరమే. మోడీకి కూడా దక్షిణాదిన రాజకీయ మిత్రుడిని వదులుకోవడం నష్టదాయకమే. దీంతో ముఖేష్ వ్యాపారాసక్తులు, మోడీ,అమిత్ షా లరాజకీయాసక్తులు ఒకటే కావడంతో టీడీపీని కేంద్రానికి దూరం కాకుండా చూసుకునే యత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

వెంకయ్య తో వెసులుబాటు…

అయిదారు నెలలుగా రాజకీయ జోక్యాలకు దూరంగా ఉంటున్న వెంకయ్యనాయుడికి మరోసారి పని పడింది. విశాఖ సదస్సులో చంద్రబాబుతో ఆంతరంగిక మంతనాలు జరిపారు. తొందరపడొద్దని హితవు చెప్పారు. ప్రత్యేకహోదా నిజానికి వెంకయ్యనాయుడు పెట్టిన ఫిట్టింగేనని బీజేపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశమే బీజేపీ తలకు చుట్టుకుంది. బీజేపీ విశ్వాసరాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఒకరకంగా వెంకయ్యనాయుడు తప్పించుకోగలిగారు. పార్టీని మాత్రం ఆనాటి ప్రత్యేకహోదా ప్రామిస్ శాపంలా వెన్నాడుతోంది. బీజేపీ, టీడీపీ బంధం తెగిపోతే వెంకయ్యనాయుడిపై కూడా ఆ ఎఫెక్టు పడుతుంది. దాంతో లౌక్యంగా తనవంతు ప్రయత్నం చేయాలని ఆయన భావిస్తున్నారు. రాజ్ నాథ్, అరుణ్ జైట్లీలతో మాట్లాడి చాలావరకూ విభజన చట్టంలోని హామీలు, సమస్యలను పరిష్కరించవచ్చనేది వెంకయ్య నాయుడి యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా పరిష్కరించాల్సిన అంశాలపై నేరుగా మోడీతో కాకుండా అమిత్ షా ద్వారా దౌత్యం నెరపడానికి వెంకయ్య అంగీకరించినట్లుగా టీడీపీ లోని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. అయితే సమయం మాత్రం తక్కువగా ఉంది. ఈలోపు ఎంతమేరకు వెంకయ్య తన చాణక్యాన్ని ప్రదర్శించి సక్సెస్ కాగలరన్న దానిపైనే టీడీపీ,బీజేపీ సంబంధాలు ఆధారపడి ఉన్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*