నెలకు మూడు కోట్లు స్వాహా?

ఇసుక అక్రమ రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోరు. తమ జేబులు నిండితే చాలు. ప్రభుత్వ ఖజానాకు గండి పడితే తమకేంటి? అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు అధికారులు. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మహారాష్ట్ర నుంచి రోజూ వందల సంఖ్యలో లారీలు నిర్మల్ వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పగటి పూటే ఈ ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖకు చెందిన అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు నెలకు దాదాపు మూడు కోట్ల రూపాయల పన్ను ను ఎగవేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వారు మాత్రం ఆమ్మామ్యాల మత్తులో తేలిపోతున్నారు.

అక్రమంగా ఇసుక రవాణా….

మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి బిడ్రేల్లి మీదుగా నిర్మల్ జిల్లాకు రోజూ వందల సఖ్యలో ఇసుక లారీలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణాకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కాని వీటికి ఎటువంటి అనుమతులూ లేవు. ప్రతి రోజూ 150 లారీలు ధర్మాబాద్ నుంచి నిర్మల్ కు వస్తున్నాయి. సాధారణంగా ఇసుకను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తే టన్నుకు నాలుగు వందల రూపాయలను వే బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాని వే బిల్లులు చెల్లించకుండానే రోజుకు వందల సంఖ్యలో లారీలు వెళ్లిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రతి లారీ 40 టన్నుల ఇసుక తీసుకెళ్తున్నా ప్రతి లారీ 4 వేల రూపాయలు వే బిల్లు రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి రోజుకు దాదాపు పదిహేను లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నిర్మల్ – భైంసా రహదారి మొత్తం ఇసుక లారీలే కన్పిస్తాయి. 322 వ జాతీయ రహదారిపై ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చిన ఇసుకను టన్ను రూ.1200ల కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వానికి వే బిల్లుల రూపంలో ఆదాయానికి గండి కొడుతూ ఇసుక మాఫియా మాత్రం లక్షల రూపాయలను ఆర్జిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఇసుక మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*