నేడు చంద్రబాబు పర్యటనలో ముద్రగడ ఎఫెక్ట్ ఉంటుందా?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుని నేటికి 27 రోజులు కావస్తోంది. ప్రతిరోజూ పద్మనాభం పాదయాత్రకు బయలుదేరడం, ఇంటి బయటే పోలీసులు అడ్డుకోవడం షరా మామూలైంది. అనుమతి తీసుకుంటేనే పాదయాత్రకు పర్మిషన్ ఇస్తామని ప్రభుత్వం, పాదయాత్రకు అనుమతి ఎందుకుని ముద్రగడ ఇద్దరూ భీష్మించుకుని కూర్చుండటంతో గత 27 రోజులుగా కిర్లంపూడిలో హైడ్రామా నడుస్తూనే ఉంది. కిర్లంపూడిలో 27 రోజుల నుంచి పోలీసు బలగాలను మొహరించే ఉన్నాయి. అయితే కిర్లంపూడికి మాత్రం నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంది. కాపునేతలు, ముద్రగడ అభిమానులు నిత్యం కిర్లంపూడికి వివిధ జిల్లాల నుంచి తరలి వస్తుండటంతో కిర్లంపూడి రోజూ కిటకిటలాడుతూనే ఉంది. ఏదో ఒకరూపంలో ముద్రగడ తన నిరసనను వ్యక్తంచేస్తూనే ఉన్నారు.

పోలీసులు ముందస్తు చర్యలు…….

అయితే శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఈరోజు కాకినాడ వస్తున్నారు. దీంతో కాపు ఉద్యమ నేతలను ముందస్తు అరెస్టులు పోలీసులు చేయనున్నారు. ముఖ్యమంత్రి సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముద్రగడకు అనుకూలంగా నినాదాలు చేస్తారని ఇంటలిజెన్స్ నివేదికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు చేసే రోడ్ షోలవద్ద, సభల వద్ద పెద్దయెత్తున పోలీసులను మొహరించనున్నారు. కాపు నేతలు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రాత్రి బస చేసే ఫంక్షన్ హాలు వద్ద కిలో మీటర్ దూరంలోకి ఎవరూ రానివ్వ కుండా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*