నోరు జాగ్రత్త…లేకుంటే పోలీస్ బాస్ లు…!

మీరు చెట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రసంగాలు చేస్తున్నారా.. సభలైనా..సమావేశాలైనా సరే జనాలను ఆకట్టుకోవాలని ఏ ప్రసంగం చేసినా ఇక తస్మాత్ జాగ్రత్త.. ఆచితూచి….మాట్లాడకపోతే తెలంగాణ పోలీసులు మీపై కొరఢా ఝుళిపిస్తారు. తడిపార్ హుకుం జారీ చేస్తారు. ఒక్కసారి ఈ ఆర్డర్ పాస్ అయ్యిందో ఇక ఆరునెలలపాటు మీకు సిటీలోకి ఎంట్రీ లేనట్లే… చట్టం పాతదే అయినా తాజాగా మరోసారి తెలంగాణ బాస్ లు తెరమీదకు తీసుకు వచ్చారు.

తడిపార్ అంటే….

తడిపార్.. ఈ పేరు వింటే చాలు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి.. తప్పు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి సవ్యంగా మసలుకోవాలని డిసైడ్ అయిపోతారు. లేదంటే పోలీసులు వారి తాట తీస్తారు. అంతే కాదు ఆ మాట పోలీసు బాస్ ల నోటి నుండి వచ్చిన మరుక్షణమే అవతలి వ్యక్తి క్షణాల్లో తట్టాబుట్టా సర్దుకోవాలి. లేదంటే మూడు సంవత్సరాలు జైల్లో ఊచలు లెక్కించాలి.

కత్తి మహేష్ పై….

తిడిపార్ అంటే… నగర బహిష్కరణ. ఇప్పడు తెలంగాణ పోలీసులు ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు. గతంలో ఏదైనా పండుగలు.. పబ్బాలు వస్తే నేరస్తులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించే వారు.. బట్ ఇప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపైనా ఈ చట్టాన్నే అమలు చేసే పనిలో పడ్డారు. అయితే ఆర్డర్స్ పాతవే అయినా పోలీసులు మాత్రం సమయాన్ని బట్టి దానికి పదును పెడుతున్నారు. చాలా కాలం తరువాత సినీ పరిశ్రమకు చెందిన కత్తిమహేష్ పై ఈ చట్టాన్ని అమలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలతో సిటీలో లా అండ్ ఆర్డర్ కి కొంత ఇబ్బందులు తలెత్తాయి. అంతే తెలంగాణ పోలీసులు ఆయనపై ఆరునెలల పాటు వేటు వేసి తన స్వగ్రామమైన చిత్తూరులో వదిలి వచ్చారు. ఆరునెలల్లో ఒకవేళ సిటీలోకి ఎంట్రీ ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఫలితంగా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

పరిపూర్ణానంద స్వామిపై…

తాజాగా మరోసారి స్వామి పరిపూర్ణానందపై ప్రయోగించారు. ఆరునెలలపాటు ఈ చట్టం స్వామీజికి కూడా వర్తిస్తుందని నోటీసులో పేర్కొన్నారు. బహిష్కరణ వేటు వేసే ముందు వారు చేసిన తప్పులు తెలియపరుస్తూ నోటీసులు అందిస్తారు. స్వామీజీ విషయంలో గత సంవత్సరం 2017 లో స్వామీజీ చేసిన ప్రసంగాలు, ఉపన్యాసాలను వారు నోటీసులో తెలియపర్చారు. కేవలం స్వామీజీ, కత్తిమహేష్ అనే కాదు రాబోయే రోజుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా మాట్లాడినా, ప్రసంగాలు చేసిన ఇదే తరహాలో స్పందించేలా తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒక మతాన్ని, కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. గత మూడు సంవంత్సరాలుగా ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణలో ఎవరైనా అల్లర్లు, గొడవలు, ఇబ్బందులు తలెత్తేలా చేస్తే ఇక వారందరికీ ఒకటే దండన అని చెబుతున్నారు పోలీస్ బాస్ లు. ఎప్పుడైతే తడిపార్ విషయం మరోసారి తెర మీదకు వచ్చిందో.. ఈ చట్టం పరిధిలోకి వచ్చిన వారి లిస్టు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. రాబోయే రోజుల్లో మరికొందరిపై కూడా వేటు వేస్తారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*