పడవలే కాదు… బస్సులూ కాల్వల్లో బోల్తా కొడుతున్నాయ్…!

రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అనపర్తి వద్ద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గల్లంతు కాగా 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో కండెక్టర్, డ్రైవర్ సహా 14 మంది వున్నారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు కెనాల్ లో బోల్తా కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి చివరి సర్వీసు కావడంతో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా వుంది. గాయపడ్డ క్షతగాత్రులను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిమ్మచీకటిగా ఉండటంతో గల్లంతు అయిన వారిని గాలించడంలో సహాయక బృందాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

భయానకంగా కెనాల్ రోడ్ ….

రాజమండ్రి నుంచి కాకినాడకు ఎడిబి రోడ్ కాకుండా అనపర్తి మీదుగా కెనాల్ రోడ్ కీలకమైనది. రద్దీగా వుండే ఈ రోడ్ ను నాలుగు రోడ్ల రహదారిగా ఆర్ అండ్ బి మార్చడానికి 200 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును ప్రపంచ బ్యాంక్ సాయంతో చేపట్టింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎంపీ రాయపాటి సాంబశివ రావు అల్లుడు కి చెందిన కంపెనీ ట్రాన్స్ స్ట్రాయి కొంత పనులు చేసి చేతులు ఎత్తేసింది. దాంతో ప్రపంచ బ్యాంక్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో సైతం పెట్టింది. కొద్దిపాటి పనులు జరిగి వదిలివేయబడటంతో ఈరోడ్ మీద వెళ్లడం అంటే నరకానికి ప్రయాణం చేయడమే అనే దుస్థితి నెలకొనివుంది. గుంతలు గోతులతో ప్రమాదభరితంగా రోడ్ ఉండటమే కాదు ఇరువైపులా కాలువలు డేంజరస్ గా ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కెనాల్ రోడ్ ను నాలుగు లైన్లుగా అభివృద్ధి పరచడం ఇరువైపులా కీలక ప్రాంతాల్లో గడ్డర్లు నిర్మించడం చేపట్టాలని గోదావరి జిల్లాల వాసులు కోరుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*