పళనిసర్కార్ ప్రమాదంలో పడినట్లేనా?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ మైనారిటీ లో పడిన నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగరరావు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. న్యాయనిపుణులతోనూ ఆయన సంప్రదిస్తున్నారు. ఈరోజు గవర్నర్ చైన్నైకి వస్తారని భావించారు. అయితే విద్యాసాగరరావు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో చెన్నై పర్యటన వాయిదా పడింది. మరోవైపు దినకరన్ వైపు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేయడంతో తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బుధవారం పళనిస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్షపై మద్రాస్ హైకోర్టు తీర్పు నివ్వనుంది. హైకోర్టు విశ్వాసపరీక్ష జరిపించాల్సిందేనని చెబితే పళనిసర్కార్ ఇరకాటంలో పడటం ఖాయమని భావించి ముందుగానే దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే విశ్వాస పరీక్షలో తమకు ఓటు వేసేందుకు అనుమతించాలని కోరుతూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఒకవేళ హైకోర్టు వారిని ఓటింగ్ కు కనుక అనుమతిస్తే పళనిసర్కార్ ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే పళనిస్వామికి విశ్వాస పరీక్షలో నెగ్గేంత బలంలేదు.

గవర్నర్ వస్తేనే తేలుతుందా?

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ బలపరీక్షకు అనుమతించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టాలిన్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందోనని గ్రహించిన పళనివర్గం వేగంగా పావులు కదిపి 18 మందిపై అనర్హత వేటు వేసింది. అయితే దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు ప్రకారం స్పీకర్ చర్య విరుద్ధంగా ఉందని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను థిక్కరించలేదని, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించలేదని, అలాంటప్పుడు వారిపై అనర్హత వేటు స్పీకర్ ఎలా వేస్తారని స్వామి ప్రశ్నించారు. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. న్యాయనిపుణులతో సంప్రదించి, రాష్ట్రపతితో మాట్లాడిన తర్వాతనే ఆయన చెన్నై కు వచ్చే అవకాశాలున్నాయి. చెన్నైకి వస్తే విశ్వాస పరీక్షపై ఏదో ఒక నిర్ణయాన్ని గవర్నర్ తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*